
మహాబలిపురంలో ‘భారతీయ మహాచరిత్ర’
కొరుక్కుపేట: మహాబలిపురంలో గల ఒక్కొక్క శిల్పం ఒక్కో చారిత్రిక ఘట్టానికి ప్రతీక అని ప్రముఖ లఘుచిత్ర దర్శకుడు శివకుమార్ అభిప్రాయ పడ్డారు. చైన్నె పట్టాభిరాంలో ఉన్న డిఆర్బీసీసీసీ హిందూ కళాశాలలో ఇండియన్ నాలెడ్జి సిస్టమ్ సెల్ తరపున భారతీయ శిల్పకళా వైభవం మీద ప్రత్యేక కార్యక్రమం గురువారం జరిగింది. భారతదేశంలో ఉన్న శిల్పకళ వైభవం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. అది కూడా 6 వ శతాబ్దానికి చెందిన పల్లవ రాజుల్లో పేరు గాంచిన నరసింహవర్మ పల్లవ రాజు చెక్కించిన మహాబలిపురంలో ఉన్న ఒక్కొక్క శిల్పం గురించి పరిశోధిస్తే అసలైన భారత దేశ చారిత్రక వైభవం ఏమిటో తెలుస్తుందని, తాను కొన్ని శిల్పాలను డీకోడ్ చేస్తే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని తన పరిశోధన గురించి తెలిపారు. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో ఏ ఐ ద్వారా ఈ శిల్పాల్లో ఉన్న అసలు చరిత్రను డీకోడ్ చేస్తే భారతదేశ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుందన్నారు. ఆ దిశగా తనతో పాటు ఆసక్తి గల విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. మహాబలిపురం శిల్పకళా వైభవాన్ని పవర్ పాయింట్ లో చూపుతూ చేసిన వారి ప్రసంగం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. అనేక శిల్పాలను చూపుతూ వాటి విశేషాలను వివరించారు. ఒక్క శిల్పానికి తాను ఏఐ ద్వారా చేసిన వీడియోను చూపించి విద్యార్థుల, అధ్యాపకుల ప్రశంసలను అందుకున్నారు. విద్యార్థుల ప్రశంసలు అందుకున్న ‘భారతీయ శిల్పకళా వైభవం’ అనే అంశం పైన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెల్ తరపున నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. కల్విక్కరసి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఐకేఎస్ సెల్ సమన్వయ కర్త ఆర్థిక శాస్త్ర అధ్యాపకురాలు డా. వి. సుజాత ముఖ్య అతిథి శివకుమార్, వారి బందంలో ఉన్న ఇతర సభ్యులకు ఆహ్వానం పలికారు. ఐకేఎస్ సెల్ సభ్యురాలు తెలుగు శాఖ అధ్యాపకురాలు డా. తుమ్మపూడి కల్పన వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు, కలైమామణి మాధవపెద్ది మూర్తి, అనిరుధ్, ప్రతిభ, విస్కాం శాఖాధ్యక్షుడు డా. రఘురావ్ పాల్గొన్నారు.