
సరిహద్దు చెక్‌పోస్టులో ఏసీబీ దాడులు
– లెక్కలోకి రాని రూ: 95 వేలు స్వాధీనం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్‌పేట వద్ద ఆంధ్ర , తమిళనాడు సరిహద్దులో ఆర్‌టీఓ చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు తమిళనాడు పర్మిట్‌తో పాటూ తగిన సర్టిఫికెట్లతో వాహనం నడుస్తుందా? అనే కోణంలో అధికారులు తనఖీ చేసి పంపుతుంటారు. ఈ చెక్‌పోస్టులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారుల వద్ద అధికారులు అఽధికంగా నగదు వసూలు చేయడంతో పాటూ వాటికి అవసరమైన రసీదు ఇవ్వడం లేదని వేలూరు అవినీతి నిరోధక శాఖ పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో వేలూరు డీఎస్పీ శంకర్ అధ్యక్షతన ఇన్‌స్పెక్టర్ మైథిలి, పోలీసులు ఆంధ్ర సరిహద్దులోని క్రిష్టియన్‌పేట చెక్‌పోస్టుకు వేకువ జామున 3 గంటల సమయంలో ఉన్న ఫలంగా వచ్చారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే కార్యాలయ గదులు, కిటికీలు పూర్తిగా మూసి వేశారు. అనంతరం అక్కడున్న వారి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని కార్యాలయంలో తనఖీ చేయగా లెక్కలోకి రాని రూ: 95 వేలును నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆంధ్ర నుంచి తమిళనాడులోని మార్కెట్‌కు తీసుకొచ్చే లారీలో నుంచి కాయకూరలను కూడా లంచంగా తీసుకొని కార్యాలయంలో ఉంచినట్లు తెలిసింది. దీంతో కాయ కూరలతో పాటూ నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ పోలీసులు మాట్లాడుతూ క్రిష్టియన్‌పేట చెక్‌పోస్టులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు, టూరిస్ట్ బస్సులు, వాహనాలను నిలిపి నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతోనే ప్రస్తుతం తనఖీలు చేపట్టారని వీటిపై సంబంధిత శాఖకు నివేదిక పంపుతామని వెల్లడించారు.