
జిల్లా ఆస్పత్రిలో జనరేటర్‌తో విద్యుత్
తిరుత్తణి: తిరుత్తణిలో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యలు తలెత్తడంతో జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశారు. తిరుత్తణిలో రూ.45 కోట్లతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి నూతన భవనం నిర్మించి ఇటీవల వైద్యసేవలు ప్రారంభించారు. ఈక్రమంలో బుధవారం రాత్రి తిరుత్తణిలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే వేకువజామున 4 గంటల సమయంలో జనరేటర్‌లో డీజిల్ అయిపోవడంతో రెండు గంటల పాటు ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం డీజిల్ తీసుకొచ్చి విద్యుత్ సరఫరా చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు విద్యుత్‌శాఖ సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యలు గుర్తించి పరిష్కరించి విద్యుత్ సేవలు పునరుద్ధరించారు.