
తిరుచ్చి శివ వ్యాఖ్యలపై రచ్చ
● నివాసం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం ● అరెస్టు చేసిన పోలీసులు ● కాంగ్రెస్‌కు బీజేపీ, అన్నాడీఎంకే సవాల్ ● సీఎం స్టాలిన్ శాంతి మంత్రం
సీఎం టోర్నీ 2025కు సన్నద్ధం
సాక్షి, చైన్నె : డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ తిరుచ్చి శివ కర్మయోగి కామరాజర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ వర్గాలు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం డీఎంకే కూటమిలో వివాదానికి దారి తీసింది. కామరాజర్‌ను అవమానించిన డీఎంకే కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు బీజేపీ, అన్నాడీఎంకేలు సవాల్ విసిరాయి. వివరాలు.. కాంగ్రెస్ దివంగత మాజీ సీఎం కామరాజర్‌ను కర్మయోగిగా, విద్యాప్రదాతంగా తమిళనాట ఆరాదిస్తున్న విషయం తెలిసిందే. కామరాజర్ 123వ జయంతిని మంగళవారం జరుపుకున్నారు. ఈ పరిస్థితులలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎ ంపి తిరుచ్చి శివ కామరాజర్‌కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియో వైరల్ అయింది. దీనిపై తొలుత కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో తిరునల్వేలి ఎంపీ రాబర్డ్ బ్రూస్ స్పందించారు. వెన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు తిరుచ్చి శివపై దాడి చేస్తూ వ్యాఖ్యల తూటాలను అందుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ నేత తిరుచ్చి వేలు స్వామి అయితే, తీవ్ర స్థాయిలో శివపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వర్గాల నేతృత్వంలో గురువారం తిరుచ్చి శివ ఇంటి ముట్టడికి గురువారం దూసుకెళ్లారు. ఈ వ్యవహారం కాస్త వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ – డీఎంకే మధ్య చిచ్చు రగిలినట్టుగా పరిస్థితి బయలుదేరింది. కూటమిలో కామరాజర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అదే సమయంలో చిచ్చును మరింతగా రగిల్చే రీతిలో అన్నాడీఎంకే, బీజేపీ దూసుకెళ్లాయి.
కాంగ్రెస్‌కు సవాల్
కామరాజర్‌ను అవమానిస్తారా? అంటూ ఓ వైపు అన్నామలైతో పాటూ బీజేపీ నేతలు, మరో వైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణిస్వామి వ్యాఖ్యల తూటాలపై దృష్టి పెట్టారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, నాడర్ల సమాఖ్య నేతలు, పీఎంకే నేత అన్బుమణి సైతం దాడికి దిగారు. కామరాజర్‌ను అవమానిస్తుంటే, కాంగ్రెస్ చోద్యం చూస్తున్నదంటూ అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కామరాజర్‌పై నిజంగా గౌరవం అన్నది ఉంటే తక్షణం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమా అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. కర్మయోగి మరణం తర్వాత కూడా ఆయన్ను అవమానిస్తారా..? అని పళణి స్వామి శివాలెత్తారు. గతంలో డీఎంకే ఇదే రకంగా కామరాజర్‌ను అవమానించిందంటూ ఆరోపణలు గుప్పించారు. డీఎంకేకు కాంగ్రెస్ నేతలు బానిసలయ్యారని మండి పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ అప్రమత్తమయ్యారు. ఆయన చేసిన ఓ ట్వీట్‌తో కూటమిలో వివాదం సద్దుమనిగినట్టైంది.
చలి కాచుకునే ప్రయత్నంలో..
గొప్ప నాయకుడు కామరాజ్ అంటూ, సమస్యలను సృష్టించి చలికాచుకనేందుకు దుష్ట శక్తులు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం స్టాలిన్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. గొప్ప నాయకుడిగా కామరాజర్ కీర్తించ బడ్డారని గుర్తు చేస్తూ అప్పట్లో గుడియాత్తం ఉప ఎన్నికలలో ఆయన అభ్యర్థిగా నిలబడ్డ సమయంలో ప్రత్యర్థిని బరిలో దించకుండా డీఎంకే దివంగత నేత అన్నాదురై చర్యలు తీసుకున్నారని వివరించారు. కామరాజర్ మరణించిన సమయంలో ఒక కొడుగా నిలబడి అంతిమ సంస్కరణల ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. కామరాజర్ స్మారక చిహ్నాం ఏర్పాటు, జయంతిని విద్యా దినోత్సవంగా డీఎంకే దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి ప్రకటించారన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా, తన పెళ్లికి స్వయంగా అప్పట్లో కామరాజర్ వచ్చారని, ఇది తన జీవితంలో ఒప్ప వరంగా పేర్కొన్నారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప తమిళుడు గురించి వివాదాస్పద చర్చలు జరపడం సరైనది కాదన్నారు. నాయకుల గౌరవాలను కాపాడే విధంగా అభిప్రాయాలను పంచుకోవాలన్నారు. సామాజిక న్యాయం, లౌకిక సామరస్యం కోసం జీవితాంతం పనిచేసిన ఆ గొప్ప నాయకుడి కలలను నెరవేర్చడానికి అందరం కలిసి పనిచేద్దాం! అర్థరహిత చర్చలకు దూరంగా ఉందాం! అని సూచించారు.
తిరుచ్చి శివ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన

తిరుచ్చి శివ వ్యాఖ్యలపై రచ్చ