
అప్రమత్తంగా..
● ముందస్తు ఏర్పాట్లపై దృష్టి ● కమిషనర్లతో సీఎం స్టాలిన్ భేటీ ● అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , నీటి సరఫరా విభాగం నేతృత్వంలో 25 కార్పొరేషన్లు, 144 మునిసిపాలిటీలు ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు ఆశాజనకంగానే ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ, ఈశాన్య సీజన్‌లో వర్షాలు అధికంగానేఉంటాయన్న సంకేతాలు వెలువడ్డాయి. నైరుతీ సీజన్ మరోరెండున్నర నెలలు ఉన్నప్పటికీ, దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో ఈశాన్య రుతు పవనాలు ఏటా భారీగానే వర్షాలను తీసుకు రావడం, తుపాన్‌లు , వాయుగండాలు ఎదురు కావడం జరుగుతోంది. దీంతో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో ప్రజలకు అవస్థలు తప్పదు. దీనిని ముందుగానే గ్రహించి ముందస్తుచర్యలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. అలాగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో జరుగుతున్న ప్రాథమిక పనులపై సర్వేకు నిర్ణయించారు.
విస్తృత స్థాయి సమీక్ష
డీప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రి కేఎన్ నెహ్రూ, ప్రధాన కార్యదర్శి మురుగానందంతో కలిసి సీఎం స్టాలిన్ మునిసిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లు, అధికారులతో సమీక్ష ఉదయం సచివాలయంలో నిర్వహించారు. తమిళనాడులోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరాలను తెలుసుకున్నారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా, వర్షపు నీటి పారుదల పనులు, తాగునీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులు, రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్కడెక్కడ అంతా వర్షపు నీటి పారుదల పనులు చేపట్టాల్సిన అవశ్యం ఉందో గుర్తించి త్వరితగతిన పనులు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దానిని అమలు చేయాలని కూడా ఆయన గుర్తించారు. పట్టణ స్థానిక సంస్థలో ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, శుభ్రతా పనులు, వీధిలైట్ల నిర్వహణ పనులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా అమల్లో ఉన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గత 4 సంవత్సరాలలో 8 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 15 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు అభివృద్ధి, మెట్రో, వివిధ ప్రయోజనకరమైన మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టులు,రైల్వే ప్రాజెక్టులు, కొత్త తాగునీటి ప్రాజెక్టులు, మురుగునీటి పారుదల పనులు వంటి వివిధ ముఖ్యమైన ప్రాజెక్టులు అమలు గురించి అధ్యయనం చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు 3,199 ఉద్యోగాలను కార్పొరేషన్లకు భర్తీ నిమిత్తం కేటాయించారు, మునిసిపాలిటీలలో 4,972 ప్రాజెక్టులు ప్రారంభించే విధంగా నిర్ణయించారు.
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు వివరించారు. చివరి దశలో ఉన్న అన్ని పనులు, సగం పూర్తయిన అన్ని పనులు, విద్యుత్ బోర్డు, నీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విద్యుత్ బోర్డు, హైవేస్ డిపార్ట్‌మెంట్, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ లతో సమన్వయం అవశ్యం అని, ఈ విభాగాల అధికారులు సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మురికినీటి కాలువలను శుభ్రం చేయించాలని, పూడిక తీత పూర్తి కావాలని, లోతట్టు ప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రాంతాలు ప్రత్యేక ప్రాధాన్యతతో పనులు చేయాలని తెలిపారు. వర్షాల సీజన్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అన్నది కలుగకుండా అన్ని ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవడమే కాకుండా, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మున్సిపల్ పరిపాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి టి. ఉదయచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తాగునీరు సరఫరా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కార్తికేయన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, కార్పొరేషన్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.