
● రూ. 37 కోట్లు కేటాయింపు ● ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రే
సాక్షి, చైన్నె: 2025 – సీఎం ట్రోపీ పోటీలకు క్రీడల శాఖ, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీలు సిద్ధమయ్యాయి. ఈ సారి మొత్తం ప్రైజ్ మనీ రూ. 37 కోట్లుగా ప్రకటించారు. సీఎం స్పోర్ట్స్ టోర్నమెంట్ రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్ ద్వారా గురువారం డిప్యూటీసీఎం, క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. వివరాలు.. భారతదేశ క్రీడా రాజధానిగా తమిళనాడును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని పాఠశాల, కళాశాల విద్యార్థులను క్రీడా పరంగా ప్రోత్సహించే విధంగా 2024లో సీఎం టోర్నీ వివిధ కేటగిరీలు, విభాగాల వారీగా విజయవంతంగా నిర్వహించారు. 2025 సంవత్సరంలో సైతం సీఎం కప్ టోర్నీకి సన్నద్దమయ్యారు. ముఖ్యమంత్రి ట్రోఫీ క్రీడలు – 2025 అన్ని జిల్లాలు , ప్రాంతీయ స్థాయిలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. విద్యార్థులు, వికలాంగులు, ప్రజలు , ప్రభుత్వ ఉద్యోగులు, పురుషులు, మహిళలు అంటూ ఐదు విభాగాలలో పోటీలకు చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 25 రకాలు, రాష్ట్రస్థాయిలో 37 రకాల క్రీడా పోటీల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. వివిధ క్రీడా పోటీలతో సహా మొత్తం టోర్నీ ఖర్చుగా రూ. 83.37 కోట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ వెబ్‌సైట్ లు htt pr://-cmtsophy.rdat.in, httpr://rdat.tn.gov.in లలో వ్యక్తిగత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు గురువారం క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జె. మేఘనాథరెడ్డి, క్రీడా విభాగం ప్రతినిధులతో కలిసి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.ఆ న్‌లైన్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లకు చివరి రోజు ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 గంటలుగా నిర్ణయించారు.
విజేతలకు బహుమతుల జోరు
రాష్ట్ర స్థాయిలో వ్యక్తిగత పోటీల విజేతలకు మొదటి బహుమతి రూ. లక్ష, రెండవ బహుమతి రూ. 75 వేలు. మూడవ బహుమతి రూ. 50,000 అందించనున్నారు. గ్రూప్ పోటీలలో, రాష్ట్ర పోటీ విజేతలకు మొదటి బహుమతి ఒక్కొక్కరికి 75 వేల రూపాయలు, రెండవ బహుమతి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు, మూడవ బహుమతి ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు అందించనున్నారు. పోటీలలో పాల్గొనే వారికి సర్టిఫికెట్లు, వెయ్యిరూపాయలు ప్రదానం చేయనున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి 6 –12వ తరగతి వరకు విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు పేర్లను నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. క్రీడాకారులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల,కళాశాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఇతర వివరాల కోసం ప్రభుత్వ పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పోర్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో సమాచారం సేకరించ వచ్చు అని సూచించారు. అలాగే, ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల మధ్య 9514 000 777 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చు అని తెలియజేశారు.