
210 స్థానాలలో గెలుపు తథ్యం
● పళణి స్వామి ధీమా
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమి 210 స్థానాలలో విజయకేతనం ఎగుర వేయడం తథ్యం అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధీమా వ్యక్తంచేశారు. కడలూరు జిల్లాలో పళణిస్వామి ప్రజా చైతన్యపర్యటన విస్తృతంగా గురువారం జరిగింది. చిదంబరం, కాట్టుమన్నార్ కోవిల్ తదితర ప్రాంతాలలో అనూహ్య స్పందన జనం నుంచి రావడం విశేషం. అలాగే రైతులతో సమావేశాలను పళణిస్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా పళణిస్వామి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం తథ్యమన్నారు. 234 స్థానాలలో 210 స్థానాలలో కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే కూటమిలోకి మరికొద్ది రోజులలో సరైన పార్టీలు వచ్చి చేరబోతున్నారని, ఆ పార్టీలు ఏమిటో ఇప్పుడే చెప్పనని వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల ఓట్లను గురి పెట్టి డీఎంకే రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎంకే కుటుంబ అరాచకాల నుంచి ప్రజలను రక్షించేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. డీఎంకేను ఓడించడం, స్టాలిన్‌ను గద్దె దించేందుకే ఈ కూటమి అని వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తాను ప్రజా సేవ, సమాజ సేవలో ఉన్నానని , అన్నాడీఎంకే వేదికగా ప్రజల పక్షాన నిలబడి సేవలు అందిస్తున్నానని పేర్కొంటూ, తమ లక్ష్యం డీఎంకే పతనం అని స్పష్టం చేశారు. తమ అమ్మ పథకాలన్నింటికీ పేర్లు మార్చి, కొత్తగా ఏదో సృష్టించినట్టుగా నాటకాలు ఆడుతూ, ప్రజల్ని మభ్య పెడుతున్న డీఎంకేకు చరమ గీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.