
తైలాపురంలో పోలీసు విచారణ
2 రోజులలో తేలుతుందన్న రామన్న
సాక్షి, చైన్నె: తైలాపురంలో ట్యాపింగ్ పరికరం లభించినట్టుగా వచ్చిన సమాచారంతో విల్లుపురం జిల్లా పోలీసు యంత్రాంగం అదనపు డీఎస్పీ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించింది. సైబర్ టీంతో కూడిన ఈ బృందం గురువారం తైలాపురం గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేసినట్టు సమాచారం వెలువడింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం పలు ధారావాహికల తరహాలో అనేక ట్విస్టులతో సాగుతున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈ వివాదానికి తెర పడుతుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో రాందాసు నివాసం తైలాపురం గెస్ట్ హౌస్‌లో ట్యాపింగ్ పరికరం సోఫా కింద లభించడం కలకలం రేపింది. దీనిపై విచారణ చేసే విధంగా డీజీపీకి రాందాసు తరపున ఓ వినతి పత్రం ఈ మెయిల్ ద్వారా పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో సైబర్ క్రైం బృందంతో కూడిన అదనపు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు తైలాపురంలో తనిఖీలు చేశారు. ట్యాపింగ్ పరికరాన్ని పరిశీలించినట్టు, అక్కడి పార్టీ వర్గాలు, సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కాగా, ఈ ట్యాపింగ్ పరికరం గురించి రాందాసు మీడియాతో మాట్లాడుతూ, ఈ పరికరాన్ని ఎవ్వరు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టారో అన్నది రెండు రోజులలో తేట తెల్లం అవుతుందన్నారు. తాను ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో సమావేశాలు నిర్వహిస్తున్నానో అన్న వివరాలను ట్యాపింగ్ చేసి ఎవరికి ఎవరు పంపించారో అన్న సమగ్ర వివరాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.