
అదనపు వసతుల కల్పనకు ప్రణాళిక
● మంత్రులు ఏవా వేలు, శేఖర్‌బాబు వెల్లడి
వేలూరు: తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయానికి భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, ప్రదోషం రోజుల్లో భక్తులు ఆలయంలో కిటకిటలాడుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వసతులు చేసేందుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏవావేలు, దేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మణివాసగన్, రాష్ట్ర కమిషనర్ శ్రీధర్ గురువారం ఉదయం ఆలయానికి చేరుకొని భక్తులకు అవసరమైన అదనపు వసతుల గురించి ఆరా తీశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభ తరంలో తక్కువ సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గర్భవతులు, దివ్యాంగులు, వృద్ధులు వెళ్లేందు అవసరమైన ప్రత్యేక దర్శన దారి, సాధారణ దర్శనం క్యూ, ప్రత్యేక దర్శన క్యూ తదితర వాటిని తనిఖీ చేశారు. అదే విధంగా భక్తులకు ఆలయంలో అవసరమైన వసతులు కల్పించారా మరిన్ని వసతులు అవసరమా? అనే కోణంలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద ఆలయ దర్శనంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపద్యంలో భక్తులు ద్వరగా దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాడ వీధులు, ఉన్నామలైయార్ ఆలయం, అన్నామలైయార్ సన్నిధి, భక్తుల ప్రత్యేక దర్శన టికెట్ కౌంటర్ తదతర వాటిని తనఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తర్పగరాజ్, ఎస్పీ సుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీదరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.