
ముగిసిన ఆణిమాస బ్రహ్మోత్సవాలు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ ఆణిమాస బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం తీర్థవారితో ముగిశాయి. వివరాలు.. అరుణాచలేశ్వరాలయంలో సంవత్సరంలో కార్తీక దీపోత్సవాలు, ఆణిమాసంలో ఆణి బ్రహ్మోత్సవాలు ఈ రెండు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో రోజూ స్వామివారిని ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ పుష్పాలంకరణ మధ్య మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సర ఆణిమాస బ్రహ్మోత్సవాలు ఈనెల 8న ద్వజా రోహణంతో శివాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ స్వామి వారికి పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. ఈ ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో ముగియడంతో శివాచార్యులు గురువారం ఉదయం వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలోని పెద్ద నందీ భగవాన్ సన్నది వద్ద ఉన్న కోనేటిలో స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పుష్పాలతో అలంకరించి దీపారాధన పూజలు చేసి భక్తుల దర్శనార్థం ఊరేగించారు. స్వామి వారిని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అరుణాచలేశ్వురునికి హరో.. హరా... నామస్మరణతో కర్పూర హారుతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
● అరుణాచలేశ్వరాలయంలో భక్తుల రద్దీ

ముగిసిన ఆణిమాస బ్రహ్మోత్సవాలు