
శివరాజ్‌కుమార్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్
తమిళసినిమా: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఇప్పుడు దక్షిణాది స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రంలో కీలక పాత్రను పోషించి తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అదేవిధంగా తాజాగా జైలర్–2 చిత్రంలోనూ నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న బహుభాషా చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇడి మన్నల్ కాదల్ చిత్రం ఫేమ్ బాలాజీ మాధవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తమిళం, కన్నడం భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. వీరి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రిద్ధిక్ మోషన్ పిక్చర్స్ పతాకంపై సురాజ్ శర్మ, కృష్ణకుమార్, ని.సాగర్ షా కలిసి నిర్మిస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నటుడిగా నాలుగవ దశాబ్దంలోకి అడుగు పెట్టిన శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో తొలిసారిగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా నటించనున్నారని, చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
శివరాజ్‌కుమార్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల