
‘పళణి’కి శాశ్వత విశ్రాంతి!
రాజకీయాల నుంచి..
● 2026 ఎన్నికల తర్వాత ఆయనకు ప్రజలు బై..బై చెబుతారు ● సీఎం స్టాలిన్ జోస్యం
సంక్షేమ పథకాలను అందజేస్తున్న సీఎం స్టాలిన్
ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి శాశ్వత విశ్రాంతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో బై బై..పళణి అన్న నినాదం రాష్ట్రంలో మిన్నంటనున్నట్టు చెప్పారు. ఇక మీతో స్టాలిన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదులన్ని సకాలంలో పరిష్కరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సాక్షి, చైన్నె: ముఖ్యమంత్రి స్టాలిన్ బుధవారం మైలాడుతురై జిల్లాలో పర్యటించారు. ఇక్కడ జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారు. రూ. 48 కోట్ల 17 లక్షల వ్యయంతో పూర్తయిన 47 ప్రాజెక్టులను ప్రారంభించారు.రూ. 113 కోట్ల 51 లక్షల విలువైన 12 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.271 కోట్ల 24 లక్షల విలువైన సంక్షేమ పథకాలను,సలహాయకాలను 54,461 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం, శివ.వి. మెయ్యనాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ఢిల్లీ ప్రతినిధి ఎ.కె.ఎస్. విజయన్, ఎంపీ ఆర్. సుధ, శాసనసభ సభ్యులు ఎం. పన్నీర్‌సెల్వం, నివేద ఎం. మురుగన్, ఎస్. రాజ్ కుమార్, మైలదుత్తురై జిల్లా కలెక్టర్ హెచ్.ఎస్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ పరిష్కారం
చిదంబరంలో మీతో స్టాలిన్ పథకం ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో వచ్చే అన్ని ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రకటించారు. మహిళల హక్కు పథకం కోసం లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని, అందరికీ అన్నీ దరి చేరుతాయని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ, కొత్త పబ్లిసిటీ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు అని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రగతిని చూసి ఓర్వ లేఖ నోటికి వచ్చింది వాగేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందుగా తాను గ్రామ గ్రామాన తిరిగానని, బెడ్ షీట్ మీద కూర్చుని స్వీకరించిన విజ్ఞప్తులను అధికారంలోకి రాగానే, వర్క్ షీట్‌గా మార్చి వర్క్ ఆర్డర్లతో అమలు చేయించామన్నారు. అయితే, ఆయన పెద్ద మేధావి వలే మాట్లాడేస్తున్నాడని, తమిళనాడు ప్రజలు నా కుటుంబం, వీరి విషయానికి వస్తే ఈ స్టాలిన్ చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. స్వలాభం కోసం పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టేసిన పళణిస్వామి ఇప్పుడు ప్రజలను, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలలో ఉన్నాడని మండిపడ్డారు. పది సంవత్సరాల వైఫల్యానికి మూల్యంగా 2019 నుంచి పళణి స్వామి అన్నీ ఓటములే అని, ప్రజలు ఆయన్న తిరస్కరిస్తూ వస్తున్నారని, 2026లో శాశ్వతంగా ఆయనకు విశ్రాంతి కల్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం వేశారు. ఈ ఎన్నికలలో పళణి...బై..బై అన్న నినాదం మార్మోగ నున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రంగంలో పళణిని నమ్మేందుకు అన్నాడీఎంకే కేడర్ సిద్ధంగా లేదని, తాజాగా అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ సుందరం ట్రావెల్స్ సినిమాను గుర్తు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పొగలు కమ్ముకుంటూ దూసుకెళ్లే బస్సులో కూర్చుని నోటికి వచ్చిన అబద్ధాలను ఆ చిత్రంలో వళ్లించినట్టుగా, ఇప్పుడు పళణి పర్యటన సాగుతోందని చమత్కరించారు. బీజేపీని నమ్మి మోసపోయేది మీరే...ప్రజలు కాదు, ప్రజలకు అండగా ద్రావిడ మోడల్ ఉంది... 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని వ్యాఖ్యలు చేశారు., శ్రీతమిళనాడు స్టాలిన్ చేతుల్లో ఉంది... సురక్షితంగా ఉంది. స్వార్థ లాభం కోసం ప్రాకులాడే వాళ్లు ఇక్కడ లేరు. అంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేశారని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముందుగా మైలాడుదురైలో డీఎంకె దివంగత నేత కరుణానిధి విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. డీఎంకే సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆ ప్రాంతాలలో ఇంటింటికీ స్వయంగా వెళ్లి సభ్యత్వ పేర్లు నమోదు చేయించారు.
కితాబు
ఎనిమిది కొత్త వాగ్దానాలు
తన ప్రసంగంలో ఎనిమిది కొత్త వాగ్దానాలు ఈసందర్భంగా సీఎం ఇచ్చారు. నిడూరు పంచాయతీలో రూ. 85 కోట్లతో రైల్వే వంతెన నిర్మాణం, తరంగం బాడి – మంగ నల్లూర్ – ఆడుతురై మార్గాన్ని రూ. 45 కోట్లతో విస్తరించనున్నామని ప్రకటించారు. సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటూ పాలు పంచుకుని, స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు స్వామి నాగప్పన్ జ్ఞాపకార్థం మైలాడుతురైలో విగ్రహం ఏర్పాటు, రూ. 7 కోట్లతో కుత్తాలం కెనాల్ పునరుద్ధరణ, తరంగంబాడి సర్కిల్‌లోని తాజంపేట, వెల్లకోయిల్ గ్రామాలలో రూ. 8 కోట్లతో మౌలిక సదుపాయాల మెరుగుదల, సిర్కాళి మునిసిపాలిటీకి కొత్త భవనం, మత్స్యకారులు సంబంధించి సిర్కాళి సర్కిల్, తిరుముల్లై వాసల్ సముద్రపు అలల తాకిడి నుంచి ఆ పరిసరాలకు రక్షణకల్పించే విధంగా రాతి గోడ నిర్మాణానికి చర్యలుతీసుకోనున్నట్టు చెప్పారు. చైన్నెలోని ఇండియన్ ఇన్‌స్టిటట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం మేరకు ఈ పనులు మొదలు అవుతాయని చెప్పారు. సిర్కాళి సర్కిల్‌లో పూంపుహార్ ఫిషింగ్ పోర్టులో డ్రెడ్జింగ్ పనుల రూ. నాలుగు కోట్లతో చేపట్టనున్నట్టు, సిర్కాళి మునిసిపాలిటీలో థెర్ కీజ్ వీధి, అప్పర్ స్ట్రీట్, సౌత్ స్ట్రీట్, నార్త్ స్ట్రీట్‌లకు ఇరు వైపులా వర్షపు నీటి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు.
సీఎం స్టాలిన్ ఈ వేడుకలో ప్రసంగిస్తూ మంత్రి శివ వి. మెయ్యనాథన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పుదుకోట్టై జిల్లాకు చెందిన నేత అయినా, బాధ్యత తీసుకొని ఈ మైలడుతురైను తన సొంత జిల్లాగా భావించి పనిచేస్తూ వస్తున్నారని కితాబు ఇచ్చారు. మైలాడుతురైకు వచ్చేందుకు తనకు నాలుగు గంటలు సమయం పట్టిందని, ఈ మేరకు ప్రజలు దారి పొడవున తనకు అభిమాన ఆహ్వానం పలికారని వివరించారు. ఇక్కడి వీధులలో నడుస్తూ ,ప్రజల్ని పలకరించే సమయంలో వర్షం సైతం పులకరింప చేసిందన్నారు. వర్షంలోనే తన మీద అభిమానం చూపినప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని వ్యాఖ్యలు చేశారు. గత 4 సంవత్సరాల ద్రావిడ మోడల్ పాలనలో ఈ జిల్లాకు రూ. 7 వేల కోట్ల మేరకు అభివృద్ధి నిధులు కేటాయించామని వివరించారు. కొత్తగా ఆవిర్భవించిన ఈ జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయం మొదలు అన్ని రకాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేశామన్నారు. ఈ జిల్లాకు ఏం అవసరమో గురించి, వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. ఈ జిల్లా మత్స్య కారులతోనూ నిండి ఉందని గుర్తు చేస్తూ వనగిరిలో చిన్న ఓడరేవు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమిళనాడు మత్స్యకారులకు భద్రత కల్పించాలంటే కచ్చదీవులను స్వాధీనం చేసుకోవడమే శాశ్వత పరిష్కారంగా పేర్కొన్నారు. తాను ఇప్పటికే పలు మార్లు ప్రధానిని ఈ వ్యవహారంపై కలిసి విన్నవించినా, ఫలితం శూన్యం అని విమర్శించారు.
రాజకీయాలు చేస్తున్నారు...
కచ్చదీవుల విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. ఒక దేశం మరో దేశంతో ఒప్పందం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకు సంబంధించిన అధికారం కేంద్రానికి ఉందని వివరిస్తూ 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు కచ్చదీవుల విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ధ్వజమెత్తారు. తమిళనాడులోని ద్రావిడ మోడల్ ప్రభుత్వం నిరంతరం మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

‘పళణి’కి శాశ్వత విశ్రాంతి!

‘పళణి’కి శాశ్వత విశ్రాంతి!