
అందరి నోట సంకీర్ణం మాట
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయ పార్టీలు కొన్ని సంకీర్ణ పాలన నినాదాన్ని అందుకున్నాయి.అన్నాడీఎంకే– బీజేపీ కూటమి పుణ్యమా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అందుకున్న ఈ నినాదం కాస్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు అన్నాడీఎంకే కూటమి వైపు చూస్తున్న పార్టీలు ,మరో వైపు డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీలు సైతం సంకీర్ణ నినాదంపై పెదవి విప్పేపనిలో పడ్డాయి. అధికారంలోకి వస్తే కూటమి పార్టీలకు ప్రభుత్వంలో వాటా ఇస్తామని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ గత ఏడాది ప్రకటన చేశారు. దీనిని పెద్దగా తమిళ పార్టీలు పట్టించుకోలేదు. అయితే, డీఎంకే కూటమిలోని వీసీకే, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐలు ఇదే అదనుగా రానున్న ఎన్నికలలో అధిక సీట్లను ఆశించనున్నామని, అధిక స్థానాలలో పోటీ చేసి గెలవడమే లక్ష్యం అని ప్రకటిస్తూ వస్తున్నాయి. డీఎంకే కూటమి బలం అన్నది ప్రస్తుతానికి గట్టిగానే ఉంది. అయితే, ఈ సీట్ల పందేరం ఎన్నికల సమయంలో ఎలాంటి చిచ్చు పెడుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో అన్నాడీఎంకే – బీజేపీ నేతృత్వంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలుత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ తదుపరి పలు ఇంటర్వ్యూలలో అధికారంలో వాటా తథ్యం,సంకీర్ణ ప్రభుత్వం అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే, తమిళనాడు చరిత్రలో ఇంత వరకు సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం అన్నది రాలేదు. డీఎంకే, అన్నాడీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వాలు కొనసాగాయి. తాజాగా అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో సంకీర్ణం అన్న చర్చ తమిళనాట జోరందుకుంది.
అన్బుమణి నోట అదే మాట
అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలోకి పీఎంకే వస్తుందన్న ఎదురు చూపులు ఉన్నాయి. అస్సలే బీజేపీ సంకీర్ణ నినాదాన్ని అన్నాడీఎంకే ఖాతరు చేయకుండా, తమ నేతృత్వంలోనే కూటమి, తన నేతృత్వంలోనే ప్రభుత్వం, సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటాం అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పష్టం చేస్తూ వస్తున్నారు. బుధవారం కూడా జరిగిన రోడ్ షోలలో ఆయన ఇదే నినాదం అందుకున్నారు. తానే కూటమికి సుప్రీం అని, తాను తీసుకునే నిర్ణయం కీలకం అని స్పష్టం చేశారు.సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదంటూ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటామని పళణి స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం పళణి స్వామి నిర్ణయం కాదు. అమిత్ షా మాటే వేద వాక్కు అని వ్యాఖ్యలు అందుకుంటున్నాయి. ఈ సమయంలో పీఎంకే లో వివాదాలు ఓ వైపు ఉంటే, నేనే అధ్యక్షుడ్ని అని చెప్పకుంటున్న అన్బుమణి బుధవారం చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇంకెన్నాళ్లు అంటూ ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. పీఎంకే కూడా తమిళనాట బలమైన పార్టీ అని, తమిళనాడు ప్రజలకు రక్షణగా సంకీర్ణ ప్రభుత్వం అన్నది అవశ్యమని వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి నిర్ణయాలన్నీ తన అధికారాలకు అనుగుణంగానే ఉంటాయని, మరొకరు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదంటూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు స్పందించడం గమనార్హం.
అన్బుమణి కొత్త నినాదం
నేనే సుప్రీం అంటున్న పళణి
కాంగ్రెస్‌లోనూ చర్చ
మౌనంగా డీఎంకే
కాంగ్రెస్‌లో..
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై కూటమి విషయంగా జాగ్రత్తలు పాటిస్తూ, డీఎంకేతో సన్నిహితంగానే ఉన్నారు. అయితే, ఈ పార్టీలోని కొందరు సీనియర్లు అయితే, సెల్వ పెరుంతొగై డీఎంకే అడుగులకు మడుగులు వత్తుతున్నారని అధిష్టానంకు ఫిర్యాదులు హోరెత్తిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, సీనియర్లు పలువురు తిరుచ్చి వేదికగా జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు డీఎంకే కూటమిలో చర్చకు దారి తీశాయి. రానుంది కూటమి పాలన అంటూ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు తప్పని సరిగా ఉంటారని, ఇదే జరగబోతున్నట్టు వ్యాఖ్యల తూటాలను పేల్చడం చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు డీఎంకే,కాంగ్రెస్ మధ్య కాస్త చిచ్చు పెట్టే విధంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో కర్మయోగి కామరాజర్‌ను అవమానించారంటూ డీఎంకే నేతలపై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి విరుచుకు పడటం మరో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సంకీర్ణ నినాదం మున్ముందు డీఎంకే కూటమిలో, అన్నాడీఎంకే కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.

అందరి నోట సంకీర్ణం మాట