
చైన్నెలో మొదటిసారి..
● సూపర్ వీల్డ్ యంత్రం ద్వారా మురుగునీటి తొలగింపు
కొరుక్కుపేట: కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో ఆధునిక యంత్రాలను ఉపయోగించి వర్షపు నీటి కాలువల నుంచి వ్యర్థాలను తొలగించడానికి మొట్టమొదటిసారిగా డ్రెడ్జింగ్ ఆపరేషన్‌ను మేయర్ ప్రియ ప్రారంభించారు. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా, చైన్నె కార్పొరేషన్ ప్రాంతాలలో కొత్త మురుగు నీటి కాలువల నిర్మాణం, మరమ్మతులు, కొత్త చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ మొదలైన వివిధ పనులు చేపడుతున్నారు. కాగా రానున్న ఈశాన్య రుతుపవనాల దృష్ట్యా, చైన్నె కార్పొరేషన్ ప్రాంతాలలో మురుగునీటి కాలువలలోని అవక్షేపాలు, వ్యర్థాలను త్వరగా, పూర్తిగా తొలగించి పారవేయడానికి ఆధునిక సూపర్ సక్కర్ యంత్రాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. తద్వారా రాయపురం మండలం వీకేసంపంత్ రోడ్డులోని వర్షపునీటి కాలువలో ఆధునిక సూపర్ వీల్డ్ యంత్రం ద్వారా నీటిని తొలగించే పనిని మేయర్ ప్రియ లాంఛనంగా బుధవారం ప్రారంభించారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
● విద్యార్థిని చదువుకు రూ.50 వేలు సాయం
కొరుక్కుపేట: చైన్నె సమీపంలోని తిరుముల్‌లై వాయిల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చదువుకొనసాగించడానికి కష్టంగా ఉన్న విద్యార్థినికి రూ.50 వేలు అందజేసి తిరుములై వాయిల్ పోలీసులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాలు.. తిరుముల్‌లై వాయిల్ స్వరస్వతి నగర్‌కు చెందిన వెంకటస్వామి కుమార్తె హెప్జిబా చైన్నెలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఇబ్బందులు కారణంగా, ఆర్థిక సమస్యల కారణంగా హెప్జిబా తన కళాశాల చదువును కొనసాగించలేకపోయింది. అయితే ఆమెకు చదువుకోవాలని కోరిక ఉంది. ఈ పరిస్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినిని రక్షించి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తిరుముల్‌లైవాయిల్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ పేదరికం కారణంగా విద్యార్థిని తన కళాశాల చదువును కొనసాగించలేకపోతున్నట్టు తేలింది. దీంతో తరువాత తిరుముల్‌లై వాయిల్ పోలీసులు విద్యార్థినికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు విద్యార్థిని హెప్జిబాకు రూ. 50 వేలు ఇచ్చి, తన కళాశాల చదువును ఉత్తమంగా కొనసాగించమని కోరారు . పోలీసుల చేసిన చర్యను అందరూ ప్రశంసిస్తున్నారు.
వేలంకన్ని ఆలయంలో వేడుకగా రథోత్సవం
తిరువొత్తియూరు: వేలంకన్ని పవిత్ర మాత ఆలయంలో బుధవారం రాత్రి ఉత్తిరియా మాతా రథోత్సవం ఘనంగా జరిగింది. నాగై జిల్లా వేలంకన్నిలో పవిత్ర మాత కేథడ్రల్ ఆలయం వుంది. ఈ ఆలయంలో మహరాష్ట్రకు చెందిన క్రైస్తవ జాలర్లు జరుపుకునే ఉత్తిరియా మాత వార్షిక ఉత్సవం 6వ తేదీన జెండా ఎగురవేయడంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోజూ ప్రత్యేక మతపరమైన సేవలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఉత్సవమైన రథోత్సవం మంగళవారం రాత్రి నిర్వహించారు.ఈ రథోత్సవానికి వేలంకన్ని ఆర్చ్ డియోసెస్ అధ్యక్షుడు హృదయరాజ్ అధ్యక్షత వహించారు. ఆర్చ్ డియోసెస్ నుంచి పవిత్ర ఉతిరియ్య మాత రథోత్సవాన్ని ఆర్చ్ డియోసెస్ ఫాదర్ అర్పుతరాజ్ ప్రారంభించారు. ఉతిరియ మాత, సెబాస్టియన్, ఆంథోనీ నగరంలోని వీధుల గుండా రథయాత్ర జరిగింది. రోడ్డు కు ఇరువైపులా వేలాది మంది క్రైస్తవులు గుమిగూడి ప్రార్థనలు చేశారు. అలాగే బుధవారం ఉదయం వేలంకన్ని కేథడ్రల్‌లో కొంకణి భాషలో పూజలు నిర్వహించారు. దీని తరువాత, జెండాను అవనతం చేయడంతో ఉత్సవాలు పూర్తవుతాయని నిర్వాహకులు వెల్లడించారు.
30 నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
సాక్షి, చైన్నె: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీ నిమిత్తం జూలై 30 నుంచి కౌన్సెలింగ్‌కు కసరత్తు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. సైదాపేటలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 6 నుంచి 72,243 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల అనుసంధానం తదితర ప్రక్రియలు పూర్తి కాగా, రాండం నెంబర్లు, ర్యాంకుల జాబితాను ప్రకటించనున్నామన్నారు. 20 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్టు పరిశీలనలో తేలింది. సమగ్ర విచారణ మేరకు చర్యలు తీసకుంటామన్నారు. వీరిపై మూడు సంవత్సరాల వరకు నిషేధం విఽధించడం ఖాయం అని హెచ్చరించారు. 25వ తేదీన మెరిట్ జాబితా విడుదలకు, 30 నుంచి కౌన్సిలింగ్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు.