
మదురైలో విజయ్ మహానాడు
● వేదిక పనులకు శ్రీకారం ● ఆగస్టు 25న నిర్వహణ ● 20 లక్షల మందితో బల ప్రదర్శన?
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. మదురై వేదికగా పార్టీ మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారు. ఆగస్టు 25వ తేదీన ఎన్నికల శంఖారావం పూరించే విధంగా ప్రజలలోకి దూసుకెళ్లనున్నారు. వివరాలు.. పార్టీ ఆవిర్భావంతో గత ఏడాది అక్టోబరులో విల్లుపురం జిల్లా విక్రవాండి వీ సాలై గ్రామంలో తొలి మహానాడును విజయ్ నిర్వహించి, తన సిద్ధాంతాలను స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సన్నద్దమయ్యే విధంగా తనతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో వాటా ప్రకటన చేశారు. ఆ తదుపరి కోయంబత్తూరులో బూత్ కమిటీ సమావేశాలను రెండు రోజుల పాటుగా విజయవంతం చేశారు. ఇది చైన్నెకు వెలుపల విజయ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలు. రెండు రోజుల క్రితం చైన్నెలో జరిగిన తొలి నిరసనకు విజయ్ హాజరై డీఎంకే, బీజేపీలపై వ్యాఖ్యల దాటి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మదురై వేదికగా మహానాడు నిర్వహణకు నిర్ణయించారు.
మదురై వేదికగా..
ఆగస్టు 25న మదురై వేదికగా ఎలియార్ పట్టిని ఎంపిక చేసినట్టు విజయ్ ప్రకటించారు. దీంతో ఇక్కడ బ్రహ్మాండ వేదిక పనులకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇక్కడ పందిరి గుంజం నాటే కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో పార్టీ నేతలు భుస్సీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలతో ఇక్కడి ఏర్పాట్లకు భూమి పూజ చేశారు. అలాగే, మదురై పోలీసు కమిషనరేట్‌లో అనుమతి కోరుతూ స్వయంగా భుస్సీ ఆనంద్‌వినతి పత్రం అందజేశారు. ఈ మహానాడు ఎన్నికల శంఖారావం పూరించే రీతిలో ఉంటుందని, ఇందులో 20 లక్షల మందిని సమీకరించే విధంగా కసరత్తులలో పార్టీవర్గాలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా,ఈ మహానాడు గురించి విజయ్ పేర్కొంటూ, ఇది ఒక రాజకీయ బ్రహ్మాండ వేడుక అని, విజయం...విజయం దిశగా అడుగులు వేద్దామని కేడర్‌కు పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా విజయ్ పార్టీ జెండా విషయంగా ఇప్పటికే వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ వాది పార్టీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఎరుపు, పసుపు, ఎరుపు వర్ణాల విషయంగా మరో పిటిషన్ కోర్టులో దాఖలైంది. ఆ వర్ణాలను తొలగించాలని ఓ సభ నేతృత్వంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.