
వేలూరు ఎస్పీ బాధ్యతల స్వీకరణ
వేలూరు: వేలూరు జిల్లా కొత్త ఎస్పీగా మయిల్ వాగనన్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అక్కడ విధులు నిర్వహించిన మదివాణన్ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఆ సమయంలో మొదటి ఫిర్యాదుగా ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తనకు గత ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని అప్పటి నుంచి తన భర్త వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ ఈ ఫిర్యాదుపై ఏడు రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తామని లేని పక్షంలో ఏడు రోజుల అనంతరం తనను వచ్చి సంప్రదించవచ్చునని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ సమస్యకు అధిక ప్రాదాన్యత ఇచ్చి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.