
క్లుప్తంగా
బాధ్యతల స్వీకరణ
కొరుక్కుపేట: కొలత్తూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ఎల్.కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేస్తున్న పాండియరాజన్ బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా నివేదించవచ్చని, ఎవరైనా నేర కార్యకలాపాలకు పాల్పడితే 9498174483ను సంప్రదించవచ్చని చెప్పారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
తిరువళ్లూరు: సహకార సంఘాల ద్వారా నిరుపేదలకు అందించే రేషన్ సరుకుల్లో నాణ్యతతో పాటు కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ కడంబత్తూరులోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించారు. ఎస్టీల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, రోడ్డు నిర్మాణం, సముదాయ భవనంతో పాటు రేషన్ దుకాణాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాలను నాణ్యతగా నిర్ణీత సమయంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కడంబత్తూరులోని రేషన్ దుకాణంలో నిరుపేదలకు అందించే రేషన్ సరుకుల వివరాలను లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సరుకులు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.
ప్రయాణికులు లేక
ఆరు విమానాలు రద్దు
కొరుక్కుపేట: ప్రయాణికులు లేక చైన్నె విమానాశ్రయంలో బుధవారం ఆరు విమానాలు రద్దయ్యాయి. సింగపూర్, ముంబయి, అండమాన్‌లకు విమానాలు నడుస్తున్నాయి. తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో ఈ విమానాలను రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానాల్లో ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించారు. వారు ఇతర విమానాల్లో ప్రత్యామ్నాయ తేదీల్లో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశారు.
కూవం నదిలో దూకి
యువకుడి ఆత్మహత్య
అన్నానగర్: చైన్నెలోని నేపియర్ బ్రిడ్జి సమీపంలో కూవం నదిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె మెరీనా కామారాజర్ రోడ్డు సమీపంలో నేపియర్ వంతెన ఉంది. మంగళవారం సాయంత్రం ఈ వంతెన కింద ఉన్న కూవం నదిలో ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోర్డ్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ఫైబర్ బోట్ ఉపయోగించి కూవం నదిలో ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం కోసం వెతుకుతున్నారు.
ముక్కులో తైలం,
కర్పూర చూర్ణం
● ఊపిరాడక 8 నెలల శిశువు మృతి
తిరువొత్తియూరు: శరీరంపై, ముక్కులో తైలం, కర్పూరం కలిపి రుద్దడంతో ఊపిరాడక 8 నెలల బిడ్డ మృతి చెందింది. వివరాలు.. చైన్నెలోని అభిరామపురంలోని వల్లవన్ నగర్, ఆర్ కె రోడ్ నివాసి దేవనాథన్ (28) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై 8 నెలల కుమార్తె యాలిని ఉంది. ఆ బిడ్డకు 13వ తేదీన తీవ్రమైన జలుబు వచ్చింది. ఫలితంగా నాటు వైద్యం పేరుతో తైలం, కర్పూరం కలిపి ఆ చిన్నారి ఛాతి, ముక్కుపై రుద్దారు. కొంతసేపటి తర్వాత, ఆ బిడ్డకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దేవనాథన్ వెంటనే తన బిడ్డను రక్షించి, చికిత్స కోసం ఎగ్మోర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతున్న ఆ చిన్నారి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ సంఘటన గురించి అభిరామపురం పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు ఆ చిన్నారి తండ్రి దేవనాథన్‌ను విచారిస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో
యువకుడి మృతి
తిరువొత్తియూరు: తిరువొత్తియూరు జేజే నగర్ పట్టినాత్తర్ కుప్పం ప్రాంతానికి చెందిన సందీప్ (23) వెల్డింగ్ పని చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే అతను, మంగళవారం సాయంత్రం చైన్నె పుళల్, వెజ్జీ టారియన్ నగర్ పరిసరాల్లోని మాధవరం రాష్ట్ర రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ టీ కాఫీ అమ్మకాల కంపెనీలో పని చేస్తుండగా.. ఇనుప కమ్మీ హై– ఓల్డ్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ షాక్ తగిలి సందీప్ పైకప్పు నుంచి పడి స్పృహ కోల్పోయాడు. ఇది చూసిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మార్గంమధ్యలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సందీప్‌కు భార్య, ఏడాదిన్నర వయసున్న బిడ్డ వున్నట్టు తెలిసింది.