
ట్రాఫిక్ తగ్గించడానికి బైపాస్
● మొదటి దశ పనులకు రూ.30 కోట్లు ● త్వరలోనే పనులు ప్రారంభం
తిరువళ్లూరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరులో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 9 కిమీ మేరకు బైపాస్ రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదటి దశ పనులు తిరుపాచ్చూర్ నుంచి సేలై వరకు ప్రారంభం కానుండగా, ఇప్పటికే ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. తిరువళ్లూరు చైన్నెకి సమీపంలోని నగరం. జిల్లా కేంద్రంగా ఏర్పాటై 25 సంవత్సరాలు దాటింది. జిల్లా కేంద్రం కావడంతో జనం నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతోపాటు తిరువళ్లూరు సమీపంలో తిరుమళిసై, శ్రీపెరంబదూరు, కాకలూరు సిప్‌కాట్‌లు వుండడంతో ఇక్కడికి వెళ్లే భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నిత్యం రద్దీ: తిరువళ్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు వెయ్యికి పైగా మట్టి, ఇసుక లారీలు వెళుతుంటాయి. దీంతో జేఎన్, సీవీనాయుడు రోడ్డు, మార్కెట్ వీధి, ఆవడి–తిరువళ్లూరు, సెంగుడ్రం–తిరువళ్లూరు రోడ్డులో వాహనాలు బారులు తీరి గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో 13 ఏళ్లుగా బైపాస్ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఎగువనల్లాటూరు నుంచి తిరుప్పాచ్చూర్ వరకు 9 కిమీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం వేయడానికి 2019లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులకు మొత్తం రూ.86.26 కోట్లు కేటాయించగా మొదటి దశ పనులను 5.6 కిమీ పనుల కోసం రూ.30 కోట్లను విడుదల చేశారు. ఈక్రమంలో ఆగస్టు మొదటి వారంలో పనులు ప్రారంభం కానున్నాయి . బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కానున్నాయి.