
రేపే సెంట్రల్
తమిళసినిమా: ప్రముఖ దర్శకుడు, తమిళ్ సినీ దర్శకుల సంఘం కార్యదర్శి పేరరసు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంట్రల్. శ్రీరంగనాధర్ మూవీ మేకర్స్ పతాకంపై వియాబియన్ దేవరాజ్, సదా కుమారగురు, తమిళ్ శివలింగం కలిసి నిర్మించిన చిత్రం సెంట్రల్. భారతీ శివలింగం కథ, దర్శకత్వం, పాటలు, మాటలు రాసి కీలక పాత్రలో నటించిన ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ కథానాయకుడిగా నటించారు. సోనేశ్వరి నాయకిగా నటించిన ఈ చిత్రంలో చిత్తా దర్శన్, ఆరుబాలా, గుణ, మెదకు రాజా, అన్బురాణి, కవినిలవన్, ఓమ్ గణేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. వినోద్‌గాంధీ చాయాగ్రహణం, ఇలా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 18న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో, ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్, ఆర్వీ ఉదయకుమార్ ,డ్రమ్స్ శివమణి చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. చైన్నెలోని సెంట్రల్‌స్టేషన్ నేపథ్యంలో సాగే డార్క్ స్టోరీ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఇది నిర్మాతల తొలి చిత్రం అని, పూర్తిచేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాతలు ముగ్గురూ ఉపాధ్యాయులేనని చెప్పారు. దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడే మీది ప్రతినాయకుడి పాత్ర అని చెప్పారన్నారు. దిగువ తరగతి ప్రజల జీవన విధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. మరో జాతిని బాధించే కథ కాదన్నారు. అందరూ ఒకటేనని సందేశంతో కూడిన కథా చిత్రం సెంట్రల్ అని పేరరసు తెలిపారు.