
సాహస వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
కొరుక్కుపేట: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సాహస వనిత అని కాయిదె మిల్లెత్ కళాశాల విశ్రాంత ఆచార్యులు సుమబాల కొనియాడారు. ఈమె ప్రతీ మహిళకు ఆదర్శనీయం అని అభిప్రాయపడ్డారు దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభలోని దుర్గా స్రవంతి సాంస్కృతిక విభాగం, శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐక్యుఏసి, సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశముఖ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జార్జిటౌన్‌లోని కేటీసీటీ బాలికల పాఠశాలలో ఏర్పాటు అయిన ఈ కార్యక్రమానికి కాయిదె మిల్లెత్ కళాశాల విశ్రాంత ఆచార్యులు సుమబాల పాల్గొని దుర్గాబాయి దేశముఖ్ గొప్పదనంపై ప్రసంగించి విద్యార్థుల్లో అవగాహన పెంచారు. కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. కేటీసీటీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిల స్వాగతోపన్యాసం చేయగా, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి. భరణి కుమారి విద్యార్థులకు ఆశీస్సులతోపాటూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా స్రవంతి కార్యదర్శి చల్లపల్లి భానుమతి, సభ్యులు ఆముక్త మాల్యద, జయశ్రీ, అనురాధ, తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ మైథిలి, ఇతర అధ్యాపక బృందం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినులు దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర విశేషాలను ఒక నాటక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.