
క్లుప్తంగా
కొత్త పాస్‌పోర్ట్ కోరుతూ సీమాన్ పిటిషన్
కొరుక్కుపేట: నామ్ తమిళన్ కచ్చి చీఫ్ కో– ఆర్డినేటర్ సీమాన్ విదేశాలకు వెళ్లేందుకు తన పాస్‌పోర్ట్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అంతలోనే ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సీమాన్ పేర్కొంటూ తాను కొత్త పాస్‌పోర్ట్ కోసం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి దరఖాస్తు చేసుకున్నప్పుడు, నాపై ఉన్న క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ నా దరఖాస్తు తిరస్కరించినట్లు తెలిపారు. రాజకీయ కారణాల వల్ల ఈ కేసులు నమోదు చేశారని, ఈనేపథ్యంలో కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తును తిరస్కరించిన పాస్‌పోర్ట్ అధికారి మణి ఆదేశాల రద్దు చేసి, పాస్‌పోర్ట్ జారీ చేయాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్, మండల్ పాస్‌పోర్ట్ అధికారి, నీలంకరై పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లకు నోటీసులిచ్చింది.
కాలువ నిర్మాణానికి భూమిపూజ
తిరువళ్లూరు: తిరునిండ్రవూర్ చెరువు నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లడానికి 850 మీటర్ల దూరంతో నిర్మించనున్న కాలువ నిర్మాణ పనులకు మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ మంగళ వారం భూమిపూజ కార్యక్రమాన్ని చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌లో పెద్ద చెరువు వుంది. చెరువు మొత్తం విస్తీర్ణం 350 హెక్టార్లుగానూ కరకట్ట 4,816 మీటర్లుగాను వుంది. ఇక్కడ 149.70 మిలియన్ ఘనపరిమాణం నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ చెరువు నిండితే మిగులు జలాలు చెరువుకు సమీపంలోని పెరియాన్‌నగర్, ముత్తమిళ్‌నగర్, కన్నికాపురం, స్వదేశీనగర్‌లోని నాలుగువేల నివాసాలకు నీరు చేరి నెలల తరబడి ప్రజలు జలదిగ్భందంలోనే వుండాల్సిన పరిస్థితి వుంది. ఈక్రమంలో నివాస ప్రాంతాలకు నీరు రాకుండా కాలువ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 2025–26 సంవత్సరం నిధులతో కాలువ నిర్మాణం కోసం రూ.9.10 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన క్రమంలో మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ భూమిపూజ చేశారు. కాలువను 850 మీటర్ల మేరకు నిర్మించనున్నారు. భూమిపూజ అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ కాలువ నిర్మాణ పనులను వేగంగా, నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తామన్నారు
ఏటీఎంలలో నగదు నింపే
సంస్థలో రూ.50 లక్షల చోరీ
● పరారీలో ఉన్న ఉద్యోగి కోసం గాలింపు
తిరువొత్తియూరు: చైన్నెలోని తేనాంపేట్‌లోని గిరియప్ప రోడ్డులో సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ పనిచేస్తోంది. ఇది ఏటీఎం సెంటర్లలో డబ్బు నింపే ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా, శంకర్ అనే వ్యక్తి ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత వారం ఏటీఎం నగదుతో నింపుతున్న సమయంలో మొత్తంలో రూ.50 లక్షల నగదు తక్కువగా వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం గురించి యాజమాన్యం కంపెనీ ఉద్యోగులను విచారించగా, ఆ డబ్బును అత్యవసర అవసరాలకు ఉపయోగించామని, డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ శంకర్ అకస్మాత్తుగా డబ్బు తిరిగి ఇవ్వకుండా అదృశ్యమయ్యాడు. దీంతో ప్రైవేట్ కంపెనీ మేనేజర్ కార్తీక్ తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శంకర్ కోసం గాలిస్తున్నారు.
పెన్షన్ రూ.5వేలకు పెంచాలి
వేలూరు: దేశవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకంజవేస్తున్నాయని భవణ నిర్మాణ కార్మికుల సంఘం అఖిల భారత అద్యక్షుడు ఆర్‌టీ పయణి అన్నారు. వేలూరులోని అన్ని కార్మికుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికులకు ప్రస్తుతం రూ.1,200 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, దానిని రూ.5 వేలకు పెంచాలన్నారు. కార్మికులు పలు సంవత్సరాలుగా ప్రభుత్వానికి చందాలు కట్టి సభ్యులుగా చేరితో అతి తక్కువ పెన్షన్ మంజూరు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే దహనక్రియలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం మాజీ అద్యక్షుడు నారాయణన్, సంక్షేమ బోర్డు సభ్యులు మహేశ్వరన్, శివానందం, రీజినల్ అధ్యక్షులు భాస్కరన్, కార్తికేయన్, జిల్లా ఆర్గనైజర్ ఉమాశంకర్, వేల్‌మురుగన్ పాల్గొన్నారు.
సురక్షిత డ్రైవింగ్‌కు చర్యలు
సాక్షి, చైన్నె: వర్షా కాలంలో సురక్షిత డ్రైవింగ్ నిర్ధారించే విధంగా ఉచితంగా 40 పాయింట్లలో వాహనాల తనిఖీలకు చర్యలు తీసుకున్నామని వోక్స్ వ్యాగన్ ఇండియా మంగళవారం స్థానికంగా ప్రకటించింది. భద్రతకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే విధంగా నమ్మకంగా డ్రైవ్ చేయడానికి మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్‌నకు శ్రీకారం చుట్టామని వివరించారు. వినియోగదారుల భద్రతను వర్షాకాలంలో ధ్రువీకరించే రీతిలో వాహన సంరక్షణ, సేఫ్ డ్రైవింగ్, కీలమైన బ్రేక్‌లు, టైర్లు, లైటింగ్ వ్యవస్థల తనిఖీలు వంటి అంశాల కోసం ప్రత్యేకంగా పాయింట్లను ఏర్పాటు చేశామని, వర్షాల సీజన్ అంతటా ఈ సేవలు సాగుతాయని డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు.