
వేడుకగా గౌరవ డాక్టరేట్‌ల ప్రదానోత్సవం
● నటి సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్
కొరుక్కుపేట: కోయంబత్తూరు వేదికగా అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారతదేశం అంతటా ఉన్న అత్యుత్తమ వ్యక్తులను, వివిధ రంగాలలో వారి అసాధారణ కషికి గాను పలువురిని గౌరవ డాక్టరేట్ లతో సత్కరించారు, ఇండియన్ మీడియా వర్క్స్ ఎండి జాన్ అమలన్ సిఫార్సుపై, యూకే లోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ డిస్టెనన్స్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్న సెయింట్ మదర్ థెరిసా విశ్వవిద్యాలయం (ఆస్ట్రేలియా) ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌లను అందజేసింది. ఈ వేడుకకు డాక్టర్ లీమా రోజ్ మార్టిన్ హాజరయ్యారు. ఇందులో చైన్నెకి చెందిన ప్రముఖ నటి సంచితా శెట్టి, మెజెంటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాఖీ షా, గోవాకు చెందిన నిర్భయ సామాజిక కార్యకర్త తారా కేర్కర్, కోయంబత్తూరుకు చెందిన సామాజిక వ్యవస్థాపకురాలు, జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఆర్‌టీఎన్ అపర్ణ సుంకు, పంజాబ్ తమిళన్ఙ్ అని పిలువబడే హర్‌ప్రీత్ సింగ్ ఆనంద్ అలియాస్ టోనీ సింగ్, గ్రాఫిక్సైట్ వ్యవస్థాపకురాలు, 26 ఏళ్ల స్మృతి, గోవాలోని టాలెంట్ హంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ జీటీలకు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇండియన్ మీడియా వర్క్స్ నిర్వహించిన కార్యక్రమం వేడుకగా సాగింది. డాక్టరేట్ అందుకున్న వారిని పలువురు అభినందించారు.