
ఆగస్టులో భువనచంద్ర సాహిత్య సాగరంపై సదస్సు
● బ్రోచర్‌ను ఆవిష్కరించిన విస్తాలి శంకర రావు
కొరుక్కుపేట: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 28, 29 తేదీల్లో భువనచంద్ర సాహిత్య సాగరం–సృజనాత్మక హరివిల్లు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం మెరీనా బీచ్‌లోని సాగరతీరాన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు ఎల్‌బీ శంకరరావు సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. వీటిని సాహితీ ప్రియులు, రచయితలు, ఆచార్యులు అయిన గుడిమెట్ల చెన్నయ్య, లింగమనేని సుజాత, డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద, డాక్టర్ ఎలిజిబెత్ జయకుమారి, సంగీత దర్శకుడు ఎంఆర్ సుబ్రమణ్యం, నాగేశ్వర రావు(ట్రిప్లికేన్ ), డాక్టర్ పాండురంగ కాళియప్ప, డాక్టర్ మాదా శంకరబాబు, విద్యార్థినీవిద్యార్థులు అందుకున్నారు. ఈ సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న సాహితీ కృషీవలుడు భువనచంద్ర అని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహిత్యం, సినీ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన అగ్రశ్రేణి రచయిత భువనచంద్ర అని పేర్కొన్నారు. భువనచంద్ర బహుముఖ సాహితీ కృషిని సమగ్రంగా తెలుసుకునే రీతిలో ఆగస్టు 28, 29వ తేదీల్లో రెండు రోజులపాటు భువనచంద్ర సాహితీ సాగరం–సృజనాత్మక హరివిల్లు పేరుతో అంతర్జాతీయ సదస్సును చేపడుతున్నట్టు విస్తాలి శంకరరావు ఈ సందర్భంగా వెల్లడించారు.