
పాలారులో చెత్త వేయొద్దంటూ ధర్నా
వేలూరు: వేలూరు కార్పొరేషన్‌లో సేకరించే చెత్తను పాలారులో వేయడాన్ని ఖండిస్తూ స్థానికులు ధర్నా నిర్వహించారు. వేలూరు ఎస్పీ కార్యాలయం వెనుక వైపున ఉన్న పాలారులో ప్రతి రోజూ కార్పొరేషన్‌లో సేకరించే చెత్తను పారిశుధ్య కార్మికులు దగ్ధం చేస్తున్నారు. దీంతో దుర్వాసన రావడంతోపాటు దోమలు, ఈగల బెడద అధికమై స్థానికులు పలు రోగాల బారిన పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఉదయం కార్పొరేటర్ సుమతితోపాటు స్థానికులు పాలారు వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో సేకరించే చెత్తతోపాటు ఆసుపత్రిలో ఉపయోగించే మందులు, చికెన్ దుకాణాల్లో సేకరించే వాటిని కూడా ఒకే చోట వేయడంతో దుర్వాసన వస్తుందని, వీటిపై పలు మార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ చెత్తను ఒక్కడ దగ్ధం చేయడం ద్వారా రాత్రి, పగలు పూర్తిగా దుర్వాసనతో కూడిన పొగలతో కమ్ముకు పోతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్, మేయర్, కార్పొరేషన్ అధికారులకు వీటిపై వినతిపత్రం అందజేశారు.