
కన్నడ పైంగిళికి.. వీడదీయని తమిళ బంధం
● సరోజాదేవి మృతికి పలువురి సంతాపం
తమిళసినిమా: కళామతల్లి ముద్దు బిడ్డలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నటి సరోజాదేవి ఒకరు. పుట్టి పెరిగింది బెంగుళేరులోనైనా, భారతీయ సినిమా చరిత్రలో నటిగా ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. 1955లో కన్నడంలో మహాకవి కాళిదాస్ అనే చిత్రంలో నటించి తొలి చిత్రంతోనే సక్సెస్‌పుల్ నాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. కాగా నటి సరోజాదేవి తమిళంలో ఎంజీఆర్‌కు జంటగా నాడోడి మన్నన్ చిత్రంతో పరిచయం అయ్యారు. 1958లో విడుదలైన ఆ చిత్రం ఘనవిజయాన్ని సాదించింది. ఆ తరువాత ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి పలువురు దిగ్గజ కథానాయకుల సరసన నటించి ప్రఖ్యాత నటిగా పేరుగాంచారు. ఎంజీఆర్‌కు జంటగా 15 చిత్రాలు, శివాజీగణేశన్‌కు జంటగా 20 చిత్రాల్లో నటించిన సరోజాదేవి తెలుగులోనూ ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో పలు చిత్రాల్లో నటించారు. అలా తమిళం,తెలుగు,కన్నడం భాషల్లో మొత్తం 200 లకు పైగా చిత్రాల్లో నటించారు. ఈమెకు అభినయ సరస్వతి అనే బిరుదు ఉంది. అదే విధంగా పద్మభూషణ్,పద్మశ్రీ వంటి అత్యున్నతి పురస్కారాలను అందుకున్న నటీమణి ఈమె. కాగా తమిళంలో సరోజాదేవి నటించిన చివరి చిత్రం ఆదవన్. ఈ చిత్రం 2020లో విడుదలయ్యింది. కాగా 87 ఏళ్ల ఈ మహానటి వృద్ధాప్యం కారణంగా సోమవారం బెంగుళూర్‌లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. దీంతో ఇండియన్ సినిమా ఒక నట సరస్వతిని కోల్పోయింది. సరోజాదేవి మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, ప్రతిపక్ష నేత పళణిస్వామి, రజనీకాంత్, కమల్‌హాసన్ సహా పలువురు సినీ రాజకీయనాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా నటి సిమ్రాన్,కుష్భూ, నటుడు విక్రమ్ ప్రభు, రాధిక శరత్‌కుమార్ మొదలగు పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కన్నడ పైంగిళికి.. వీడదీయని తమిళ బంధం