
ఘనంగా మాస్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం
● గుడిమెట్ల చెన్నయ్యకు ఘన సత్కారం
కొరుక్కుపేట: మద్రాసు ఆదిఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం(మాస్)–చైన్నె ఆధ్వర్యంలో 33వ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి పెరంబూరులోని డీఆర్‌బీసీసీ స్కూల్ ఆడిటోరియం వేదికై ంది. మాస్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కొల్లిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు పాల్గొన్నారు. చైన్నెతోపాటు చుట్టపక్కల ప్రాంతాలలో 10వ తరగతి, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాదించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున 67 మందికి స్కాలర్‌షిష్‌లు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2025 సంవత్సరానికి తెలుగు ఉగాది పురస్కారం అందుకున్న జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్యను మాస్ తరఫున ఘనంగా సత్కరించారు. ముందుగా మాస్ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసులు స్వాగతోపన్యాసం చేయగా, అధ్యక్షుడు డాక్టర్ కొల్లిరాజు 1992లో దివంగత కేజీ గోపాలకృష్ణ స్థాపించిన మాస్ ఆవిర్భావం నుంచి చేపడుతున్న కార్యక్రమాలను సభకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.మోహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమయం, విద్య ప్రాముఖ్యతను వివరించారు. కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని హితవు పలికారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నా టామ్స్ వ్యవస్థాపకుడు గొల్లపల్లి ఇశ్రాయేల్, జిల్లా రెవెన్యూ అధికారి జీఆర్ దివ్య, మద్రాసు వర్శిటీ తెలుగుశాఖాధ్యక్షుడు విస్తాలి శంకర రావు, మాస్ సలహాదారు ఏ.జైసన్, టామ్స్ బీఎన్ బాలాజీ, జీసీ పెద్ద నాగూర్, యు.నాగయ్య తదితరులు మాట్లాడారు. మాస్ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య సూచనలతో మాస్ జాయింట్ ట్రెజరర్ వి.దీనదయాళన్, జాయింట్ సెక్రటరీ ఎన్.రాజీవ్, ఎస్.తిరుపతయ్య, ఎం.వీరయ్య, ఏఎన్.రాజేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వందన సమర్పణను జాయింట్ సెక్రటరీ పి.పాల్ కొండయ్య చేశారు.