
సూపర్‌గుడ్ ఫిలింస్ చిత్రంలో విశాల్
తమిళసినిమా: తమిళం, తెలుగు సినీ పరిశ్రమలో సూపర్‌గుడ్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్ర అధినేత ఆర్.బీ.చౌదరి పలువురు నిర్మాతలకు మార్గదర్శి. నూతన దర్శకులకు, సాంకేతిక వర్గానికి అవకాశం కల్పించడం ఆయన ప్రత్యేకత. ఈయన పరిచయం చేసిన వారంతా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. అదే విధంగా సూపర్‌గుడ్ ఫిలింస్ కొత్త వారితో పాటు, స్టార్ హీరోలతోనూ చిత్రాలను నిర్మించి, విజయాలను సాధించింది. అలా ఇప్పటి వరకూ 98 చిత్రాలను నిర్మించింది. కాగా 99వ చిత్రాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులో నటుడు విశాల్ హీరోగా నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రం ఇటీవల విడదలై మంచిి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈయన నటిస్తున్న ఈ చిత్రం విశాల్‌కు 35వ చిత్రం అన్నది విశేషం. నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సోమవారం ఉదయం చైన్నెలోని సూపర్‌గుడ్ ఫిలింస్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు కార్తీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. నటుడు కార్తీ క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ను చైన్నెలో 45 రోజులపాటు నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న 99వ చిత్రంలో రవిఅరసు దర్శకత్వంలో తన 35వ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని నటుడు విశాల్ పేర్కొన్నారు. మార్క్ ఆంటోని తరువాత జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని, మదగజరాజా చిత్రం తరువాత ఛాయాగ్రహకుడు రిచర్డ్ ఎం.నాథన్ ఈ చిత్రానికి పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.