
అమెరికన్ తమిళుల కోసం బన్‌బట్టర్ జామ్
తమిళసినిమా: రెయిన్ ఆఫ్ ఆరోస్ పతాకంపై సురేశ్ సుబ్రమణియన్ నిర్మించిన చిత్రం బన్‌బట్టర్ జామ్. బిగ్‌బాస్ సీజన్–5 విన్నర్ రాజు జయమోహన్ కథానాయకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్త్ దర్శకత్వం వహించారు. ఆద్య ప్రసాద్, దివ్య ట్రిక్కా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో నటుడు చార్లీ, శరణ్య పొన్‌వన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నిర్మాత సురేశ్ సుబ్రమణియన్ అమెరికాలో వ్యాపారవేత్త కావడంతో బన్ బట్టర్ జామ్ చిత్రాన్ని ఇటీవల అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా, ఉత్తర అమెరికా తమిళ సంఘం ఫెడరేషన్ ఆప్ తమిళ్ సంఘాస్ ఆఫ్ నార్త్ అమెరికా తరఫున ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. చిత్ర ట్రైలర్‌ను ముందుగానే విడుదల చేయడంతో దాన్ని చూసి ఈ ప్రదర్శనకు సుమారు 5 వేలకు పైగా తమిళ ప్రేక్షకులు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకుని బన్ బట్టర్ జామ్ చిత్రాన్ని తిలకించినట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రాన్ని చూసిన వారంతా చాలా బాగుందని ప్రశంసిస్తూ అమెరికాలో ఉండి తమిళ చిత్రాన్ని ఎలా నిర్మించారంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిపారు. అమెరికాలోని తమిళ ప్రేక్షకులను అలరించిన బన్ బట్టర్ జామ్ చిత్రం త్వరలో తమిళనాడులోని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందన్నమాట.