
రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
●ప్రాణభయంతో కిందికి దూకిన
ఆరుగురికి గాయాలు
అన్నానగర్: చైన్నెలోని పెరవళ్లూరులో ఆదివారం రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాణాలతో బయటపడటానికి 2వ అంతస్తు నుంచి దూకి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చైన్నె పెరవళ్లూరులోని ఎస్.ఆర్.పి. కాలనీ వీధిలో హరి గోవింద్ యాజమాన్యంలోని రెండు అంతస్తుల భవనం ఉంది. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ పార్కింగ్, జిమ్, మొదటి అంతస్తులో జిమ్, రెండవ అంతస్తులో స్నూకర్ హాల్, కాఫీ షాప్ ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విద్యుత్ లోపం కారణంగా భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమైన మంటలు రెండవ అంతస్తు వరకు వ్యాపించాయి. దీని వల్ల దట్టమైన పొగలు ఎగిసి రెండవ అంతస్తు వరకు వ్యాపించాయి. మొదటి అంతస్తులోని వ్యక్తులు దిగగలిగారు. అయితే రెండవ అంతస్తులోని స్నూకర్ హాల్‌లోని ఆరుగురు వ్యక్తులు మెట్లపై పొగ కమ్ముకోవడంతో కిందికి దిగలేకపోయారు. దీంతో ఆరుగురు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రెండవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకారు. ఈక్రమంలో వారంతా గాయపడ్డారు. వారిలో, కొలత్తూర్ వినాయగపురం వీరరాఘవన్ నగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ (42) పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే సెంబియం, కొలత్తూరు అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు అంతస్తుల్లో చెలరేగిన మంటలను ఆర్పారు. పెరవళ్లూరు పోలీసులు ఈ ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.