
కిడ్నాప్ కేసులో నిందితుల విచారణ
తిరువళ్లూరు: బాలుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఐదుగురి వద్ద సీబీసీఐడీ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుధవారం తిరువళ్లూరులోని వారి కార్యాలయంలో విచారణ చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు సమీపంలోని కిళాంబాక్కం గ్రామానికి చెందిన ధనుష్. ఇతను తేని జిల్లాకు చెందిన విజయశ్రీ అనే యువతిని ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి వనరాజా, బంధువులు మణిగంఠన్, గణేషన్, మహేశ్వరి, శరత్‌కుమార్ కలిసి యువకుడి తమ్ముడిని కిడ్నాప్ చేశారు. ఐదుగురిని గత నెల 13న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురచ్చిభారతం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్‌మూర్తి, ఏడీజీపీ జయరామ్‌లకు సంబంధం వుందన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జగన్‌మూర్తి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకోగా, ఏడీజీపీ అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఈనేపథ్యంలోనే కేసు విచారణ సీబీసీఐడీకి బదిలీ జరిగింది. నిందితులను కస్టడీకి అనుమతించాలని కోర్టుతో సీబీసీఐడీ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో బుధవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ తిరువళ్లూరులోని సీబీసీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ రెండు రోజుల పాటు సాగనుంది. విచారణ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.