
రోడ్డులో సంచరిస్తున్న పశువుల పట్టివేత
తిరువళ్లూరు: వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్డులో అడ్డదిడ్డంగా సంచరిస్తున్న పశువులను మున్సిపల్‌శాఖ అధికారులు పట్టి గోశాలకు తరలించారు. తిరువళ్లూరులో తిరుపతి–చైన్నె, తిరుత్తణి–తిరువళ్లూరు, ఊత్తుకోట–తిరువళ్లూరు, తిరువళ్లూరు–పేరంబాక్కం, తిరువళ్లూరు–రెడ్‌హిల్స్ మార్గాల్లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డులో పశువులు అడ్డదిడ్డంగా తిరగడం, రాత్రి సమయంలో రోడ్డుకు మధ్యలో పడుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రోడ్డులో సంచరించే పశువులను పట్టాలని వాహనచోదకులు కలెక్టర్ సహా ఉన్నతాధికారులకు విన్నవించారు. ఇందులో భాగంగానే రోడ్డుపై సంచరించే పశువులను పట్టి గోశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని 27 వార్డులో సంచరిస్తున్న 78 పశువులను పట్టుకుని గోశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కొందరు పశువుల యజమానులు గోశాలకు వెళ్లి రూ.2 నుంచి రూ.3వేల వరకు జరిమానా చెల్లించిన వారికి పశువులను అప్పగించారు. ఇకపై రోడ్డుపై పశువులను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.