
చంద్రగిరిలో క్రీడలకు శిక్షణ
తిరుపతి అర్బన్: క్రీడల అభివృద్ధికి పునాదులు వేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఒలింపియన్ స్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ రజనితోపాటు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. క్రీడారంగంలో ఆసక్తి ఉన్న 6–8ఏళ్ల విద్యార్థులను గుర్తించి, చంద్రగిరిలో వారికి వసతులు కల్పించడంతోపాటు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్ట్ మొదటి వారంలో వారికి పోటీలు నిర్వహించడానికి ఎస్సీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. క్రీడారంగంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్రీడాకారిణి రజని పలు సూచనలు చేశారు. ప్రధానంగా హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్ తదితర క్రీడల్లో విద్యార్థులు రాణించడానికి తీసుకోవాల్సిన విషయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి, డీఎస్‌డీఓ శశిధర్, ఆంధ్ర హాకీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, హాకీ కోచ్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.