
కాట్పాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి డివిజన్ పరిధిలోని కిల్‌తాన్‌పట్టరై ప్రాంతంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాట్పాడిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 208 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కార్పొరేషన్ పరిధిలో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ సమయంలో సమీపంలోని రేషన్ దుకాణంలో కొనుగోలు చేసేందుకు కార్డుదారులు బారులు తీరడంతో వారి వద్ద కలెక్టర్ విచారణ జరిపారు. ఇందుకు వారంలో మూడు రోజులు మాత్రమే రేషన్ దుకాణం తెరుస్తారని దీంతో తాము నిత్యవసర వస్తువులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, వారికి అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. రోజూ ఎటువంటి ఆహారం ఇస్తున్నారు, ఆహారం నాణ్యతగా ఉందా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటూ కార్పొరేషన్ డివిజన్ చైర్మన్ పుష్పలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.