
కొట్టి చంపేశారు!
సాక్షి, చైన్నె: తిరుభువనంలో లాకప్ డెత్ తీవ్ర వివాదానికి దారి తీసింది. సెక్యూరిటీ అజిత్‌కుమార్ శరీరంలో గాయాలు తీవ్రంగా ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులే అతడ్ని కొట్టి చంపేశారన్నది నిర్ధారణ కావడంతో హత్య కేసు నమోదు చేయాలని ప్రతి పక్షాలు పట్టుబడుతున్నాయి. వివరాలు.. శివగంగై జిల్లా తిరుభువనం సమీపంలోని మనప్పురం ఆలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న అజిత్ కుమార్‌ను విచారణ పేరిట పోలీసు లాకప్ డెత్ చేసినట్టుగా వెలువడ్డ సమాచారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగడంతో ఈకేసుతో సంబంధం ఉన్న తిరుభువనం పోలీసు స్టేషన్‌కు చెందిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అదే సమయంలో విచారణ పేరిట మనప్పురం ఆలయం ఆవరణలోని గో శాల వద్ద అజిత్‌కుమార్‌ను విచక్షణా రహితంగా పోలీసులు చితక్కొట్టేస్తున్నట్టుగా వీడియో మంగళవారం వైరల్‌గా మారింది. అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరో రహస్యంగా ఈ వీడియో చిత్రీకరించడంతో పోలీసు పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. తక్షణం ఆ ఐదుగురు పోలీసులను అరెస్టు చేస్తూ చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో మానా మదురై డీఎస్పీ షణ్ముగ సుందరం హస్తం బయటపడింది.
ప్రభుత్వం కన్నెర్ర
వీడియో వైరల్ కావడంలో తక్షణం డీఎస్పీ షణ్ముగం సుందరంను సస్పెండ్ చేశారు. శివగంగై ఎస్పీ ఆశీష్ రావత్‌ను వీఆర్‌కు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామనాథపురం ఎస్పీ చాందీష్‌కు అదనంగా శివగంగై బాధ్యతలను అప్పగించారు. అదే సమయంలో విచక్షణ కోల్పోయి అజిత్‌పై పోలీసులు దాడి చేస్తున్న వీడియో మధురై ధర్మాసంనకు సైతం చేరింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరీ అజిత్‌కుమార్‌ను విచారించాల్సిన అవశ్యం ఎందుకు వచ్చింది అని పోలీసు ఉన్నతాధికారులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. అజిత్‌కుమార్ శరీరమంతా గాయాలు ఉన్నట్టు తేటతెల్లం కావడం బట్టి చూస్తే, ఈ కిరతకత్వానికి అనుమతి ఎవరు ఇచ్చారని మండిపడ్డారు. ఈ దాడి ఎవరు చేశారో, వారిపై తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అజిత్‌కుమార్ పోస్టుమార్టం నివేదిక మేరకు 18 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్టు, మెదడులో రక్తం గడ్డ కట్టడం, గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు వెలుగు చూసినట్టు విచారణ బృందం వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. ఈ ఘటను సంబంధించి సమగ్ర వివరాలను బయట పెట్టాలని కోరుతూ ఈనెల 3వ తేదిన రాజరత్నం స్టేడియం వద్ద నిరసనకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. కాగా ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ, పోలీసుల తీరు వెలుగులోకి రావడంతో తక్షణం చర్యలకు ఆదేశించామన్నారు. సంబంధిత అధికారులను సైతం వదలి పెట్టేది లేదని, ఈ కేసు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామన్నారు.
అజిత్ శరీరం అంతా గాయాలు
ఐదుగురు పోలీసుల అరెస్టు
డీఎస్పీ సస్పెన్షన్
వీఆర్‌కు ఎస్పీ