అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Mon, May 27 2024 6:20 PM

-

●నైవేలి పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన

అన్నానగర్‌: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందడంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆదివారం ఉదయం బంధువులు నైవేలి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేయడం కలకలం రేపింది. కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కీళకొల్‌లై గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌(36)కు భార్య, పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఎన్‌ఎల్‌సీ ఆర్చ్‌ గేట్‌ సమీపంలోని థిల్లానగర్‌లో బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో అక్కడ వాహన తనిఖీలు చేపడుతున్న నైవేలి నగర పోలీసులు రాజ్‌కుమార్‌ వాహనాన్ని కూడా నిలిపి సంబంధిత పత్రాలు అడిగారు. రాజ్‌కుమార్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. అలాగే సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు రాజ్‌కుమార్‌ బైక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సరైన పత్రాలు చూపించి బండి తీసుకుని వెళ్లమని చెప్పి రాజ్‌కుమార్‌ని ఇంటికి పంపించారు. ఈ స్థితిలో పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న దుకాణం ఎదుట తెల్లవారుజామున 1 గంటకు రాజ్‌కుమార్‌ శవమై కనిపించాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో రాజ్‌కుమార్‌ బంధువులు, గ్రామస్తులు 100 మందికి పైగా ఆదివారం ఉదయం 8 గంటలకు నైవేలి సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గుమిగూడారు. రాజ్‌కుమార్‌ మృతికి పోలీసులే కారణమని ఆరోపించారు. పోలీసుల కళ్లుగప్పి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న కదలూరు జిల్లా ఎస్పీ రాజారామ్‌, డీఎస్పీ సబీవుల్లా, పోలీసులు నిరసనలో పాల్గొన్న వారితో చర్చలు జరిపారు. తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హామీ ఇవ్వడంతో బంధువులు, గ్రామస్తులు నిరసన విరమించి వెళ్లిపోయారు. నీ నిరసన కారణంగా ఆ ప్రాంతంలో 2 గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement