● హరోంహరా నామస్మరణతో పులకించిన అరుణాచలేశ్వర ఆలయం | Sakshi
Sakshi News home page

● హరోంహరా నామస్మరణతో పులకించిన అరుణాచలేశ్వర ఆలయం

Published Sat, Nov 18 2023 12:48 AM

- - Sakshi

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 6.10 గంటల సమయంలో శివాచార్యులు వేద మంత్రాల నడుమ భక్తుల హరోం హరా నామస్మరణాల మధ్య ఆలయంలోని 64 అడుగుల బంగారు ధ్వజస్తంభానికి శివాచార్యులు ప్రత్యేక పూజలు, వేద మంత్రాలు చదివి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ముందుగా తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ తలుపులు తెరిచి మూలవర్‌ సన్నిధిలో అన్నామలైయార్‌, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులైన వినాయకుడు, మురుగన్‌, చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ పుష్పాలంకరణలో వున్న స్వామివారిని దర్శించుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి, కలెక్టర్‌ మురుగేష్‌, ఎస్పీ కార్తికేయన్‌, ఆలయ జాయింట్‌ కమిషనర్‌ జ్యోతి పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులు పంచమూర్తులను వెండి అద్దాల విమానంలో ఆలయ మూడవ ప్రాకారంలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు పంచమూర్తులకు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు మూషిక, హంస, వెండి నంది, సింహవాహనంలో చిద్వి లాసం చేస్తూ విహరించారు.

ఉత్సవాలకు గొడుగులు..

పది రోజుల పాటు జరిగే ఉత్సవంలో స్వామివారు వివిధ వాహనాల్లో ఉదయం, సాయంత్రం ఊరేగనున్నారు. ఇందుకోసం వాహనాల్లో ఉపయోగించే గొడుగులను చైన్నెకు చెందిన అరుణాచల భక్త సేవా సభకు చెందిన భక్తులు 30 గొడుగులను ఉచితంగా స్వామివారికి అందజేశారు. ముందుగా దిండుగల్‌ రోడ్డు నుంచి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ రాజగోపురం దారిలో మూడవ ప్రాకారంలో ఉన్న ఆలయ కార్యాలయం వద్దకు చేరుకొని ఆలయ జేసీ జ్యోతి వద్ద గొడుగులను అందజేశారు.

నేడు వాహన సేవలు..

18న శనివారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు సూర్యప్రభ వాహనం, సాయంత్రం పంచమూర్తులు వెండి ఇంద్ర వాహనంలో ఊరేగింపు.

ఊరేగింపుగా స్వామివారి గొడుగులు
1/3

ఊరేగింపుగా స్వామివారి గొడుగులు

ధ్వజారోహణానికి హాజరైన శివాచార్యులు
2/3

ధ్వజారోహణానికి హాజరైన శివాచార్యులు

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
3/3

హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

Advertisement
 
Advertisement