‘ఉపనేత’ సీటుకు న్యాయ పోరాటం

అసెంబ్లీలో పళణి, పన్నీరు (ఫైల్‌)  - Sakshi

● హైకోర్టులో అన్నాడీఎంకే పిటిషన్‌ ● స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనేత సీటు వ్యవహారం కోర్టుకు చేరింది. అన్నాడీఎంకే తరఫున దాఖలైన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. వివరణ ఇవ్వాలని స్పీకర్‌ అప్పావు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. అన్నాడీఎంకేను పళణిస్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బయటకు పంపించారు. అయితే, గతంలో ఆయనకు తాము అప్పగించిన పార్టీ శాసనసభాపక్ష ఉప నేత పదవిని వెనక్కు తీసుకోలేని పరిస్థితి. ఈ పదవిలో పార్టీ నేత ఉదయకుమార్‌ను పళనిస్వామి నియమించారు. అన్నాడీఎంకే శాసనసభా పక్షం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే, అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు ఈ నిర్ణయాన్ని ఇంత వరకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే పలుమార్లు స్పీకర్‌ను కలిసి అన్నాడీఎంకే సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం. పళణి , పన్నీరు పక్కపక్కనే సభలో కూర్చోవాల్సిన పరిస్థితి. గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీటు గొడవ సభలో రచ్చకు దారి తీసింది. తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఆర్‌బీ ఉదయకుమార్‌ను నియమించాలని, ప్రధాన ప్రతి పక్షనేత సీటు పక్కనే ఆయనకు సీటు కేటాయించాలని సభలో నినదించారు. అయినా స్పీకర్‌ అప్పావు ఏ మాత్రం తగ్గలేదు. ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలో తన వ్యక్తిగత నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో న్యాయ పోరాటంపై పళని స్వామి దృష్టి పెట్టారు. తమ పార్టీ శాసనసభా పక్ష ఉపనేతగా ఆర్‌బీ ఉదయకుమార్‌ను అంగీకరించాలని, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తన పక్కనే సీటు కేటాయించే విధంగా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం న్యాయమూర్తి అనిత సంపత్‌ నేతృత్వంలో బెంచ్‌లో విచారణకు వచ్చింది. అన్నాడీఎంకే తరఫున సీనియర్‌ న్యాయవాది విజయనారాయణన్‌ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం స్పీకర్‌ అప్పావు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top