వృద్ధాప్య 53,205
దివ్యాంగ 18,458
వితంతు 56,277
ఒంటరి మహిళ 6795
చేనేత 873
కల్లుగీత 6,552
ఎయిడ్స్ 1205
పైలేరియా 2,109
డయాలసిస్ 258
మొత్తం 1,45,732
సూర్యాపేట : చేయూత పెన్షన్ల మంజూరుపై అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు గానూ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హుల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తు దారులు జాబితాలో తమ పేరు ఉంటుందనే ఆశతో ఉన్నారు.
జిల్లాలో 1,45,732 పింఛన్‌దారులు
సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 1,45,732 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో అత్యధికంగా వితంతు పింఛన్లు 56,277 ఉండగా, 53,205 మందికి వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. చివరగా 2022 ఆగస్టులో కొత్తగా పింఛన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు నాలుగేళ్లుగా వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తుకున్న వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో నిరాశలో ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ డబ్బులే ఆధారమవుతున్నాయి.
20వేల దరఖాస్తులు
కొత్త పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 20వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్ల పంపిణీలో మొదటగా దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, వితంతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 50 శాతానికి పైగా దరఖాస్తుదారులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. పింఛన్ల మంజూరుకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయా కేటగిరీల వారీగా చేసుకున్న దరఖాస్తులను విచారిస్తారా..? లేదంటే కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారా..? అన్నది స్పష్టత లేదు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఫ జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
ఫ లబ్ధిదారుల జాబితా సిద్ధం
చేయాలని అధికారులకు ఆదేశాలు
ఫ ఒకట్రెండు రోజుల్లో డీఆర్‌డీఓలకు
అందనున్న ఉత్తర్వులు
ఫ దరఖాస్తు దారుల్లో చిగురిస్తున్న ఆశలు


