దేవరకొండతో ప్రత్యేక అనుబంధం ఉంది
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దేవరకొండ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన అమ్మమ్మ ఊరు దేవరకొండ మండలంలోని ముదిగొండ అని, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే స్వగ్రామం ముదిగొండే అన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సమయంలో దేవరకొండ ప్రాంత ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ అందించారని, ఈ ప్రాంతం వాసులు తనపై చూపే అప్యాయతను ఎప్పటికీ మరువలేనన్నారు. జిల్లాలో 2.50లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. జిల్లా వ్యాప్తంగా 15.63 లక్షల మందికి సన్న బియ్యం అందుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ముందున్నామని, దేవరకొండ నియోజకవర్గంలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.45 కోట్లు చెల్లించామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అంభభవాని, కంబాలపల్లి, పొగిళ్ల, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టు ఇరిగేషన్ పనులకు రూ.440 కోట్లు మంజూరు చేశామని, ఈ లిఫ్టు ఇరిగేషన్ పనులు పూర్తయితే 37వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పెండ్లిపాకల ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల, మిర్యాలగూడ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్ట్‌తోపాటు మిగతా ప్రాజెక్టులన్నీ ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు.


