నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి
భానుపురి (సూర్యాపేట) :గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా.. ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినా, ఇతరాలపై ఫిర్యాదులను నేరుగా తన ఫోన్ నంబర్ 9676845846కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలులో ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి తిరిగి యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కోర్టుల భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
కోదాడ: కోదాడ పట్టణంలో నూతనంగా చేపట్టిన నాలుగు కోర్టుల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద కోరారు. శనివారం ఆమె కోదాడ కోర్టును అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో నిర్మాణలో ఉన్న నాలుగు కోర్టుల నూతన భవనాన్ని పరిశీలించారు. అనంతరం కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం కోర్టులు నడుస్తున్న భవనాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నందున సదరు కాంట్రాక్టర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మోతె మండలాన్ని కోదాడ కోర్టు పరిధిలో కలపాలని న్యాయవాదులు ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కోదాడ కోర్టు న్యాయమూర్తులు కె.సురేష్, భవ్య, ఎండి.ఉమర్, కోదాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ, రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
విత్తన, విద్యుత్ బిల్లులను వ్యతిరేకించాలి
అర్వపల్లి : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నష్టం చేకూర్చేలా తీసుకొచ్చిన ముసాయిదా విత్తన, విద్యుత్ బిల్లులు–2025ను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు కోరారు. శనివారం తిమ్మాపురంలో జరిగిన ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8న చేపట్టనున్న ఆయా బిల్లల కాపీల దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, గంట నాగయ్య, సాగర్, ఉదయగిరి, కునుకుంట్ల సైదులు, పి.కిరణ్, చిరంజీవి, రవి, ఉపేంద్ర, వెంకట్‌యాదవ్ పాల్గొన్నారు.
నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి


