రెండో విడత ఉపసంహరణ
కోదాడ : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల వరకు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్ధానాలకు నామినేషన్‌లు దాఖలు చేసిన అభ్యర్థులు పలువురు ఉపసంహరించుకున్నారు. కోదాడ నియోజకవర్గంలో కోదాడ, అనంతగిరి, నడిగూడెం, మోతె, మునగాల, చిలుకూరు మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల్లో మొత్తం 181 పంచాయతీలు ఉండగా ఇందులో 23 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. ఇక 158 పంచాయతీల్లో సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఇక, వీటి పరిధిలోని 1,628 వార్డులకు గాను 256 వార్డులు ఏకగ్రీవం కాగా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
చివరి క్షణం వరకు సాగిన బుజ్జగింపులు
సర్పంచ్ ఎన్నికల్లో ఒకే పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని బుజ్జగించి రంగం నుంచి తప్పించడానికి ఆయా పార్టీల పెద్దలు తీవ్రంగా శ్రమించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావులతో పాటు ముఖ్యనాయకులు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నాయకులతో చివరి క్షణం వరకు మంతనాలు జరిపి బుజ్జగించి చాలాచోట్ల నామినేషన్లను ఉపసంహరింప జేశారు. కానీ, కొన్నిచోట్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు.
గుర్తుల కేటాయింపు..
శనివారం సాయంత్రం నామినేషన్‌ల ఉపసంహరణ పూర్తి కాగానే అభ్యర్ధులకు గుర్తులను కేటాయించారు. గుర్తులు పొందిన అభ్యర్ధులు కరపత్రాలు, మోడల్ బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌ల బాటపట్టారు. కాగా రెండో విడత 8 మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మరో 7 రోజులు మిగిలి ఉండడంతో అభ్యర్థ్ధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
23 సర్పంచ్, 256 వార్డు స్థానాలు ఏకగ్రీవం
ఫ బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన అధికారులు
ఫ 158 గ్రామాల్లో ఈనెల 14న పోలింగ్
పంచాయతీలు వార్డులు
181 1,628
23 ఏకగ్రీవాలు 256
158 ఎన్నికలు జరిగేవి 1,372


