20 నెలలుగా 35 శాతం పనులే..
గడువులోగా పనులు పూర్తిచేయిస్తాం
యూజీడీ నిర్మాణంలో జాప్యం
ఫ సూర్యాపేటలో కొనసాగుతున్న
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు
ఫ పైప్‌లైన్ ఏర్పాటు కోసం
అంతర్గత సీసీ రోడ్ల తవ్వకం
ఫ అస్తవ్యస్త దారులతో అవస్థలు
ఫ గడువులోగా పనులు పూర్తిచేయాలని అంటున్న పట్టణవాసులు
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమృత సిటీ పేరుతో చేపట్టిన సెంట్రల్ డ్రెయినేజీ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లను జేసీబీలతో తవ్వేస్తున్నారు. దీంతో రోడ్లనీ గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. మంచి రోడ్లన్నీ తవ్వేస్తున్నారని, తర్వాత మరమ్మతులు చేస్తారో చేయరో అని పట్టణవాసులు అంటున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వి పైపులు వేస్తుండగా మరికొన్ని వార్డుల్లో మ్యాన్‌హోల్స్ గుంతలు తీస్తున్నారు. దీంతో ఏ గల్లీలో ప్రయాణించాలన్నా ఎక్కడ బ్లాక్ చేశారో ఎటునుంచి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.
గడువు ఐదు నెలలే..
పట్టణంలో యూజీడీ పనులు రూ.316 కోట్ల అంచనా వ్యయంతో 290 కిలోమీటర్ల పొడవున చేపట్టడానికి ప్రణాళికలు రూంపొందించారు. కేఎన్‌ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టు దక్కుంచుకుంది. పనుల కోసం పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. పనులకు 2023లో శంకుస్థాపన చేయగా 2024 మార్చిలో ప్రారంభించారు. 2026 మార్చిలో పనులు పూర్తి చేయడానికి గడువు విధించారు. ఐదేళ్ల పాటు మెయింటనెన్స్ బాధ్యత కేఎన్‌ఆర్ కంపెనీ చూడాల్సిఉంది. అయితే పనులు చేపట్టి 20 నెలలు పూర్తయినా 35 శాతమే పూర్తయ్యాయి. ప్రస్తుతం బాలాజీ నగర్, భగత్‌సింగ్ నగర్, చింతలచెర్వు, జమ్మిగడ్డ, చర్చి కాంపాండ్, అంబేద్కర్ నగర్‌లో పనులు కొనసాగుతున్నాయి. పనుల పూర్తికి ఐదు నెలల సమయమే ఉండడంతో ఆలోగా పూర్తవుతాయో కావో.. ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు పడాలని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందుల్లో వాహనదారులు
పట్టణంలో రోడ్లను తవ్వి మెయిన్ పైప్‌లైన్ వేసి పూడ్చారు కానీ రోడ్డును చదును చేయకుండా సిమెంటుతో నిర్మాణం చేపట్టకుండా వదిలేస్తున్నారు. దీంతో గుంటలు ఏర్పడి దానికి తోడు వర్షం పడడంతో ఆయా రోడ్లన్నీ బురదమయంగా మారరడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని పట్టణంలోని వివిధ కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సదురు కాంట్రాక్టర్‌తో పనులు వేగంగా పూర్తిచేయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
యూజీడీ నిర్మాణం పొడవు 290 కి.మీ.
అంచనా వ్యయం రూ.316 కోట్లు
పనులు ప్రారంభమైంది 2024మార్చి
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్‌లైన్ వేయటం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చాలా కాలనీల్లో మ్యాన్ హోల్స్ నిర్మిస్తున్నారు. తవ్విన రోడ్లను కాంట్రాక్టు సంస్థనే మరమ్మతులు చేస్తుంది. గడువులోగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తిచేయించి వినియోగంలోకి తెస్తాం.
– అనిల్,
పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఏఈ, సూర్యాపేట
20 నెలలుగా 35 శాతం పనులే..


