16న పీఓడబ్ల్యూ శిక్షణ తరగతులు
సూర్యాపేట అర్బన్ : కోదాడలో ఈ నెల 16న జరిగే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలను చైతన్యవంతులను చేయడం కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, ఐతరాజు పద్మ, రేహమతి, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించి స్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్తీక మాస పూజల్లో భాగంగా మట్టపల్లిలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాబిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
సూర్యాపేటటౌన్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని టీపీటీఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్‌లోని మహర్షి డిగ్రీ కళాశాల వద్ద కళాశాల యాజమాన్యం, అధ్యాపకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని, గత నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు మూతపడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ నాయకులు ఉయ్యాల నరసయ్య, మహర్షి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ నగేష్, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
నల్లగొండ నుంచి
రాజధానికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఆర్టీసీ డిపో నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీ, రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు రెండు డీలక్స్ బస్సులు ప్రారంభించనట్లు పేర్కొన్నారు. నల్లగొండ నుంచి వయా ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా విప్రో హైటెక్ సిటీకి, ఎల్‌బీ నగర్ మీదుగా ఎయిర్‌పోర్టు మధ్య ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. నల్లగొండ హైటెక్ సిటీకి ఉదయం 6.45, మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి హైటెక్ సిటీ నుంచి ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. నల్లగొండ నుంచి ఎయిర్‌పోర్టుకు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు, ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
16న పీఓడబ్ల్యూ శిక్షణ తరగతులు


