విద్యార్థులను దోచేస్తునా్నరు!
ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు
కోదాడ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పరీక్ష ఫీజు దందాకు తెరలేపాయి. పరీక్ష ఫీజు వందల్లో ఉండగా కళాశాలలు మాత్రం విద్యార్థుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజు పేరుతో సగటున ఒక్కో విద్యార్ధి నుంచి రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఇంటర్నల్ ఎగ్జామ్ ఫీజు, ఎంసెట్ ఫీజు అంటూ రకరకాల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ తంతు ప్రతిసంవత్సరం జరుగుతున్నా జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని కళాశాలల్లో రూ.5వేల వరకూ వసూలు
2025– 26 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 14 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌తో కలిపి రూ.630గా బోర్డు నిర్ణయించింది. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు అన్నీ కలిపి రూ.870 చెల్లించాల్సి ఉంది. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు చెల్లించవచ్చు. కానీ ప్రైవేట్ కళాశాలలు దీనికి భిన్నంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నాయి. కోదాడ, సూర్యాపేటలో కొన్ని కళాశాలలు రూ.5 వేల వరకూ వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా రూ.2.25 కోట్లు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 4404 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 4,591 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి సగటున రూ.2500 అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల నుంచి రూ.2.25 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. అయితే ప్రతి విద్యార్థి నుంచి కొంత మొత్తం నిర్ణయించి బోర్డు అధికారులకు ముట్టజెప్పుతున్నందునే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇంటర్ విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు ఒక్క రూపాయి అధికంగా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇతర ఇంటర్నల్ పరీక్షల ఫీజు పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని మాకు సమాచారం వస్తుంది. పరీక్ష ఫీజు మాత్రమే ప్రత్యేకంగా తీసుకుని రశీదు ఇవ్వాలి. ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేస్తాం. విద్యార్థులుగాని, తల్లిదండ్రులుగాని ఫిర్యాదు చేస్తే సదరు కళాశాలపై చర్యలు తీసుకుంటాం.
– భానునాయక్, జిల్లా ఇంటర్ బోర్డు అధికారి
కళాశాలలు సంఖ్య ఫస్టియర్ సెకండియర్
(విద్యార్థుల సంఖ్య)
ప్రభుత్వ 8 1,599 1,167
ఎయిడెడ్ 48 2,594 2,178
ప్రైవేట్ 30 4,404 4,591
మొత్తం 86 8,567 7,936
ఫ పరీక్ష ఫీజు రూ.వందల్లో ఉంటే వేలల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలలు
ఫ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఫీజు
పేర్లు చెప్పి అదనంగా వసూలు
ఫ 9వేల మంది విద్యార్థులపై భారం
ఫ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న
జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు


