తడి, పొడి.. ఆచరణలో తడబడి
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని మున్సిపల్ అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రెండు రకాల చెత్తను ఒకే డబ్బాలో వేసి ఇస్తున్నారు. దీంతో తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు.
రెండు డబ్బాలు ఇచ్చినా..
మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఆకుపచ్చ, నీలం రంగు డబ్బాలు ఇంటింటికి రెండు చొప్పున అందజేశారు. కానీ పట్టణవాసులు రెండు రకాల వ్యర్థాలను కలిపి చెత్త సేకరణ వాహనదారులకు అందజేస్తున్నారు. దీంతో ఆటోలో వేర్వేరు అరలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు. గతంలో పొడి చెత్తను వేరుచేసి కార్మికులు విక్రయించుకునేవారు. ఇప్పుడు అది పట్టించుకోకుండా డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పోస్తున్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా పట్టణవాసుల్లో మార్పు కనిపించడం లేదు. కొందరు మాత్రమే చెత్తను వేరు చేసి ఇస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీలో
మొత్తం వార్డులు 48
పట్టణ జనాభా 1,53,000
నివాస గృహాలు 38000
రోజు వెలువడే చెత్త
తడి చెత్త 30 టన్నులు
పొడి చెత్త 15 టన్నులు
మిక్స్‌డ్ 10 టన్నులు
ఫ చెత్తను వేర్వేరుగా అందించాలని
అవగాహన కల్పిస్తున్నా
ప్రజల్లో కనిపించని మార్పు
ఫ ఫలించని సేంద్రియ
ఎరువుల తయారీ లక్ష్యం


