ప్రతి విద్యార్థి లక్ష్యం కలిగి ఉండాలి
సూర్యాపేట: విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యం కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమ హక్కులను తెలుసుకోవడం ముఖ్యమన్నారు. సెల్‌ఫోన్ వాడటం వల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెల్‌ఫోన్ కేవలం చదువు కోవడానికే ఉపయోగించాలని సూచించారు. ఫోన్‌లో బెట్టింగ్ గేమ్స్ ఆడటం వల్ల ఆర్థికపరమైన నష్టాలు వస్తాయన్నారు. 18ఏళ్ల వయసు నిండకుండా బైక్ నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరిబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, న్యాయవాదులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


