వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
కొండమల్లేపల్లి: రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్ గ్రామ గేటు సమీపంలో జరిగింది. ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మధునాయక్(33) భార్యాపిల్లలతో కలిసి దేవరకొండ పట్టణంలో అద్దెకు ఉంటూ అక్కడే అపోలో ఫార్మసీలో మెడికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం కొండమల్లేపల్లి అపోలో ఫార్మసీకి బదిలీ కాగా.. ప్రతిరోజు దేవరకొండ నుంచి కొండమల్లేపల్లికి బైక్‌పై వచ్చి వెళ్తుండేవాడు. శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకుని కొండమల్లేపల్లి నుంచి దేవరకొండకు వెళ్తుండగా.. కొండమల్లేపల్లి మండలం కొల్‌ముంతలపహాడ్ గ్రామ గేటు సమీపంలోకి రాగానే మధునాయక్ బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధునాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న బిహార్ రాష్ట్రానికి చెందిన అనుసింగ్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మధునాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యాన్ ఢీకొని..
మునగాల: హైవే దాటుతున్న వ్యక్తిని వ్యాన్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన సిరికొండ కోటేష్(30) గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల ఫ్‌లైఓవర్ దాటుతుండగా.. కోదాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న మారుతీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోటేష్‌ను స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
కారు ఢీకొని..
హుజూర్‌నగర్: బైక్‌పై యూటర్న్ తీసుకుంటున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం హుజూర్‌నగర్ పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన పశ్య రాంరెడ్డి(75) తన బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కోదాడ రోడ్డులోని పెట్రోల్ బంక్‌లోకి యూటర్న్ తీసుకుంటుండగా.. కోదాడ నుంచి హుజూర్‌నగర్ వైపు వస్తున్న మఠంపల్లికి చెందిన బధ్రంరాజు అనూష కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి రాంరెడ్డిని ఢీకొట్టింది. అతడు రోడ్డుపై పడిపోవడంతో తలకి గాయమైంది. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు అనిల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం


