జూదరుల అరెస్ట్
సూర్యాపేట: పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామ శివారులో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపారు. అరెస్టయిన వారిలో గాజులమల్కాపురం గ్రామానికి చెందిన ముగ్గురు, ఏపీలోని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వారి నుంచి రూ.2400 నగదు, నాలుగు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వర్కట్‌పల్లిలో మరో ఐదుగురు..
వలిగొండ: వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్కట్‌పల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద ఐదుగురు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో పేకాట స్థావరంపై పోలీస్ సిబ్బంది దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు. వారి నుంచి నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం సంతలో కొనుగోలు చేసిన 50 పశువులను వాహనంలో హైదరాబాద్‌లోని బహదూర్‌పురాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాహనం డ్రైవర్ ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్‌భార్గవ్ తెలిపారు.
విద్యావేత్తల శిక్షణ సదస్సు
భువనగిరి: బీబీనగర్ మండలం మహాదేవ్‌పురంలో గల బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌లో శనివారం విద్యావేత్తలకు శిక్షణ సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నుంచి ప్రొపెసర్లు, అధ్యాపకులు సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఆలోచన శక్తి, నైపుణ్యత, నైతిక విలువలు, మానసిక ఒత్తిడిని అధిగమించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మణిపూర్ సెంట్రల్ యూరివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తిరుపతి రావు, అనురాగ్ యూనివర్సిటీ మాజీ వీసీలు రామచంద్రం, రాజయోగ్‌థాట్, ట్రైనర్లు ముఖేష్, చిత్ర, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.


