విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి
యాదగిరిగుట్ట: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కందిగడ్డతండా గ్రామానికి చెందిన తేజావత్ హేమ్లానాయక్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన పొలంలో ట్రాక్టర్‌తో పనిచేస్తూ.. ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపగా పైన ఉన్న 11కేవీ కరెంట్ తీగలు ట్రాక్టర్ ట్రాలీకి తగిలి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు తేజావత్ వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు.
విద్యుత్ తీగకు మరమ్మతు చేస్తూ..
డిండి: డిండి మండలం దేవత్‌పల్లితండాకు చెందిన రైతు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవత్‌పల్లితండాకు చెందిన రమావత్ మణిపాల్(40) గ్రామ శివారులో తనకున్న ఐదెకరాల భూమిలో వరి సాగు చేశాడు. అతడు శనివారం వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే పొలంలో విద్యుత్ తీగ తెగి పడి ఉండటం గమనించి మరమ్మతు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


