ప్రిన్సిపాల్ మందలించారని..
కొండమల్లేపల్లి: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుమలగిరి సాగర్‌కు చెందిన సభావట్ శ్రీను, కళ దంపతుల కుమార్తె సభావట్ మౌనిక దేవరకొండ పట్టణ పరిధిలో గల టీటీడబ్ల్యూఆర్‌ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మౌనిక వారం క్రితం తన ఇంటికి వెళ్లి శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతుండడంతో ప్రిన్సిపాల్ మందలించారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థినుల ముందు మౌనికతో హేళనగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీచర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందని గంటసేపు తరగతి బయట నిలబెట్టడంతో కళ్లు తిరిగి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఫ డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం


